కేరళ చిత్ర పరిశ్రమతో పాటు యావద్దేశం షాక్ తినేలా ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై లైంగిక దాడి జరిపించిన హీరో ఉదంతం పెను సంచలనంగా మారింది. ఇండస్ట్రీ సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సదరు హీరో ఇంత దుర్మర్గానికి ఎందుకు పాల్పడ్డాడు.? రీల్ హీరో రియల్ విలన్ గా మారటానికి దారి తీసిన కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. సోమవారం అరెస్టయిన దిలీప్‌ను కోర్టు మంగళవారం 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. అయితే, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల అభ్యర్థన మేరకు బుధవారం పోలీసు కస్టడీకి అనుమతించింది. కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ సహా ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కుట్రకు దిలీపే సూత్రధారి అని సునీ విచారణలో చెప్పాడు. పోలీసుల విచారణలో రోజుకో నిజం వెలుగుచూస్తోంది..
దీలిప్ కావ్యమాధవన్‌తో అప్పట్లో రహస్యంగా ప్రేమాయణం నడుపుతున్న విషయాన్ని తన భార్య అయిన మంజు వారియర్‌కు స్వయంగా ఆ నటే చెప్పిందన్న కక్షతో దిలీప్ రగిలిపోయాడు. ఆ నటిని ఘోరంగా అవమానించాలనుకున్న దిలీప్.. 2013లో ఎర్నాకుళంలోని ఓ హోటల్లో పల్సర్ సునీతో కలిసి కుట్రపన్నినట్లు పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు.
ఆమెపై అఘాయిత్యం జరుగుతున్నప్పుడు వీడియోలో చిత్రీకరించాలనీ, ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలను బాగా తీయాలనీ కూడా దిలీప్ కోరాడని ,ఆ నటిపై కిరాతకానికి పాల్పడేందుకు దిలీప్ వారికి రూ.1.5 కోట్లను ముట్టచెబుతానని కూడా హామీ ఇచ్చాడని పోలీసులు వెల్లడించారు. అయితే, అలాంటి వీడియోలను తీసిన సునీ, అతడి సహచరుడు విఘ్నేష్‌లు వాటిని దిలీప్ ప్రస్తుత భార్య కావ్యకు ఇచ్చేందుకు వెళ్లారా లేదా అనేది నిర్ధారించవలసి ఉందని పోలీసులు తెలిపారు. ఆ దక్షిణాది నటి ప్రయాణిస్తున్న కారులోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కనీసం నలుగురు వ్యక్తులు ఆమె పట్ల దుర్మార్గంగా వ్యవహరించి వాటన్నిటినీ చిత్రీకరించారు.
కాగా, దిలీప్ ను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి తొలగించినట్టు మమ్ముట్టి ప్రకటించారు.. ‘అమ్మ’ ప్రధాన కార్యదర్శి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాట్లాడుతూ, ఈ అసోసియేషన్ నుంచి దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామని, ఇటువంటి వ్యక్తులను ‘అమ్మ’ ప్రోత్సహించదని, అందరి కోసం ‘అమ్మ’ పనిచేస్తుందని చెప్పారు. ‘సోదరి భావనకు మొదటి నుంచి మద్దతుగానే నిలిచాం. మా మద్దతు ఆమెకు ఎప్పుడూ ఉంటుంది’ అని మమ్ముట్టి చెప్పారు.