వరుస హిట్లతో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు. ఈ ఏడాది మరిన్ని హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమవుతున్న దిల్ రాజు త్వరలోనే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కూడా ఈ విషయంపై ఓ కథనాన్ని ప్రచురించింది. సీఎం కేసీఆర్ దిల్‌రాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ ఆ కథనంలో పేర్కొంది. దీంతో ఈ వార్త టీ టౌన్‌లో, రాజకీయ వర్గాల్లో జోరుగా ఉహాగానాలకు తెరలేపింది.
2019 ఎన్నికలు..తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న గులాబీ పార్టీ..మరోసారి అధికార పీఠం కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్దమవుతోంది. అభివృద్ధి నినాదాన్ని తీసుకోవడంతో పాటు పార్టీకి సినీ గ్లామర్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన నిర్మాత దిల్ రాజును గులాబీ గూటీకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్….దిల్ రాజును ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత, రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నందున ఆమె సీటును దిల్ రాజుకు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. పార్టీకి సినీ గ్లామర్ ను అద్దే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని దిల్ రాజుకు ఆఫర్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆహ్వానంపై దిల్ రాజు సైతం కొంత పాజిటివ్ గానే స్పందించినట్టు తెలిసింది.
తెలంగాణ యాస, భాషతో విజయం సాధించిన ఫిదా సినిమాను ఇటీవల చూసిన సీఎం కేసీఆర్…నటీనటులు చక్కగా నటించారని ప్రశంసలు గుప్పించారు.ఇటీవల దిల్ రాజు నిజామాబాద్‌లో ఫిదా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో తారల తళుకుల కంటే ప్రజాప్రతినిధుల హడావుడి ఎక్కువగా కనిపించడంతో ఈ ఫంక్షన్ నిర్వహించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ తెరపైకొచ్చింది. పైగా ఈ వేడుకలో దిల్ రాజు సినిమాల కంటే, అతని కుటుంబం అందించిన సేవలను పలువురు కొనియాడటం కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరి ఈ విషయంలో దిల్ రాజు స్పందన ఏంటన్నది అధికారికంగా తెలియాల్సి వుంది.