మంత్రి కేటీఆర్, మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ మధ్య మరోసారి ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ వార్ నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఇరువురు నేతలు పరస్పర విమర్శలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి పెంచారు.డిగ్గీరాజా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
డిగ్గీ రాజా పూర్తిగా గతి తప్పారన్నారు. ఆయన గౌరవప్రదంగా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్నారు. దిగ్విజయ్ వయసుకు తగిన పనులు చేసుకుంటే మంచిదని కేటీఆర్ ట్విట్టర్లో సూచించారు. ఎట్టకేలకు ‘తెలంగాణ’ స్పెల్లింగ్ నేర్చుకున్నందుకు సంతోషమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
డ్రగ్ కుంభకోణంలో టిఆర్ఎస్ వారసుల హస్తం ఉందని డిగ్గీ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో భారీ డ్రగ్ స్కాం జరిగిందని, అధికార పార్టీ వారసుల హస్తం ఉందని ట్వీట్ చేశారు. వారందరినీ విచారిస్తారో లేక రక్షిస్తారో చూడాలన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
గతంలో కూడా దిగ్విజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై కూడా అప్పుడు కేటీఆర్ ధీటుగా స్పందించారు.