కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాను ట్వీట్ చేసిన ప్రతిసారీ ఎదో ఒక సమస్యను కొనితెచ్చుకుంటునే ఉన్నారు. ఒక్కోసారి డిగ్గీరాజా చేసే ట్వీట్స్ కి ఆయన వయసుకి అసలు సంబంధమే ఉండదు. తాను చేసే ట్వీట్స్‌తో ఇప్పటికే వ్యతిరేకతలను ఎదుర్కొన్న డిగ్గీపై తాజాగా మళ్ళీ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
అసలు విషయానికొస్తే… గుజరాత్ అసెంబ్లీ కోటాలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ ను గెలిపించాలని కోరుతూ ఆ రాష్ట్ర నేత శంకర్ సింగ్ వాఘేలాను ఉద్దేశించి దిగ్విజయ్ ట్వీట్ చేశారు. ఇంకేముందీ…ఆ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోయారు.

‘వాఘేలా భాయ్.. నీకు కాంగ్రెస్ ఎంత చేసిందో మరిచిపోకు, నువ్వు ఒక రాజ్‌పుత్ వి, అహ్మద్ భాయ్ ను గెలిపించు. అతడు మన స్నేహితుడు, మద్దతుదారుడు..’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో వాఘేలా కులం గురించి ప్రస్తావించడం, అహ్మద్ పటేల్ ను గెలిపించాలని డిగ్గీరాజా పిలుపునివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుల రాజకీయాలను చేస్తోందని కొంతమంది విమర్శించారు. మరికొందరు.. అహ్మద్ పటేల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అతడు ఉద్ధరించినది ఏమిటి? అని ప్రశ్నించారు. సోనియాకు సేవ చేయడమేనా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా..సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అయిన అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు పంపించడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. పటేల్ ను నెగ్గించుకోవాలంటే కాంగ్రెస్ కు కనీసం 45 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. మామూలుగా అయితే అహ్మద్ పటేల్ సులువుగా నెగ్గేవాడే.
అయితే శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో పాటు, కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గుతుండటంతో.. అహ్మద్ పటేల్ గెలుపు ప్రశ్నార్థకం అయ్యింది. అందుకే వాఘేలా మీద ఒత్తిడి తీసుకురావడానికి దిగ్విజయ్ ట్వీట్లు పెట్టాడని నెటిజన్లు మండిపడుతున్నారు.

