పొలిటికల్ థ్రిల్లర్‌ ధర్మయోగి…

317
online news portal
- Advertisement -

రఘువరన్‌ బి.టెక్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అప్పటి నుంచి తెలుగులో ధనుష్‌ సినిమాలు సమాంతరంగా విడుదలవుతున్నాయి. కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేసే ధనుష్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ఇక తమిళంలో ధనుష్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ‘కోడి’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘ధర్మ యోగి’ పేరుతో డబ్ చేశారు. కెరీర్‌లోనే తొలిసారి డబుల్‌ రోల్ సినిమాలో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి విలక్షణమైన కథలను, పాత్రలను ఎంచుకునే ధనుష్‌ చేసిన ప్రయోగం ఫలించిందా….లేదా చూద్దాం.

కథ :

ధర్మ (ధనుష్), యోగి (ధనుష్) కవలపిల్లలు. చిన్నప్పట్నుంచే తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండే యోగి, పెద్దయ్యాక అదే రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇక ధర్మ బాగా చదువుకొని కాలేజీ ప్రొఫెసర్ అవుతాడు. యోగీ యూత్ లీడర్‌గా ఎదుగుతాడు. యోగీ ప్రేయసి రుద్ర(త్రిష)సైతం మరొక పార్టీలో యూత్ లీడర్‌గా పేరు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో వచ్చిన ఎన్నికల్లో వీరిద్దరు తలపడతారు. అయితే,అనుకోకుండా యోగి హత్యకాబడతాడు. దీంతో యోగిని హత్య చేసింది ఎవరు..?చివరికి యోగి మర్డర్ మిస్టరీ ఎలా వీడింది అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ,ధనుష్ నటన. యోగి, ధర్మ అనే రెండు పాత్రల్లో ధనుష్‌ చక్కటి తేడాను ప్రదరిస్తూ మంచి అభినయాన్ని కనపరిచాడు. రఫ్‌గా ఉండే యోగి, సాఫ్ట్‌గా ఉండే ధర్మ పాత్రల్లో ధనుష్‌ మంచి మార్కులనే సంపాదించుకున్నాడు. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రిష పాత్ర గురించి తొలిసారి నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో త్రిష చక్కగానే ఒదిగిపోయింది. అనుపమ పరమేశ్వరన్ తన పరిధిమేర బాగా నటించింది.ఇంటర్వెల్, సెకండాఫ్‌లో వచ్చే మూడు, నాలుగు ట్విస్ట్‌లు బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

కొన్నిచోట్ల కథ నెమ్మదిగా నడవడమే మైనస్‌గా చెప్పుకోవాలి. ఫస్టాఫ్‌ అంతా ఆసక్తికరంగానే సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ బ్లాక్‌ చాలా బావుంది. అయితే అదే ఆసక్తిని సెకండాఫ్‌లో మెయిన్‌టెయిన్‌ చేయలేకపోయాడు. కాస్తా లెంగ్త్‌ కూడా పెరిగింది. పక్కా తెలుగు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు.

online news portal

సాంకేతిక విభాగం :

ఇక టెక్నికల్‌ టీంలో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు దురై సెంథిల్‌కుమార్‌ గురించి…మంచి కాన్సెప్ట్‌ను తీసుకున్నాడు. వెంకటేష్‌ సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటర్‌ ప్రకాష్‌ తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. శశాంక్‌ వెన్నెలకంటి మాటలు, రామజోగయ్యశాస్త్రి పాటలు సాధారణంగానే అనిపించాయి. కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చూడాలనుకునేవాళ్లు ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు. నటీనటులందరి దగ్గర్నుంచీ అద్భుతమైన నటనను రాబట్టడం, సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ నటిపించడం లాంటి అంశాల్లో దర్శకుడిగా దురై విజయం సాధించాడనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

కెరీర్‌లో తొలిసారి డ్యుయల్ రోల్ పాత్రలో నటించిన ధనుష్‌ పొలిటికల్ థ్రిల్లర్ కథే ధర్మయోగి. బలమైన కథ, కథనాలతో పాటు, బలమైన పాత్రలతో అలా ఆకట్టుకునే ఓ సినిమా. ధనుష్, త్రిషల అద్భుతమైన నటన, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వచ్చిన ఈ సినిమాలో అక్కడక్కడా కాస్త రిపీటెడ్ సన్నివేశాలు రావడమే మైనస్‌గా చెప్పాలి. కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చూడాలనుకునేవాళ్లు ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు.

విడుదల తేదీ : 29/10/2016
రేటింగ్ : 3/5
నటీనటులు : ధనుష్, త్రిష, అనుపమ పరమేశ్వరన్
సంగీతం : సంతోష్ నారాయణన్
నిర్మాత : సి.హెచ్‌.సతీష్‌కుమార్‌
దర్శకత్వం : ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌

- Advertisement -