ఓయూ వందేళ్ల ఉత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను జ్యోతి ప్రజ్వాళన చేసి ప్రారంభించిన ప్రణబ్ వందేళ్ల క్రితం ఇదే రోజు ఒకే విజన్‌తో ఈ యూనివర్సిటీని ఏర్పాటుచేశారని తెలిపారు. ఉస్మానియా దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీ అని చెప్పారు. ఉన్నత విద్యలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.
వందేళ్లలో యూనివర్సిటీల్లో ఎన్నో మార్పులు వచ్చాయని క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. 1956లో యూజీసీ ఏర్పడిందని గుర్తుచేశారు. దేశంలో 757 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని… యూనివర్సిటీలు కొత్త ఆలోచనలకు మార్గదర్శకమన్నారు.
ఐఐటీల్లో దాదాపు క్యాంపస్ ఎంపికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పాత ఐఐటీల్లో 100 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని గుర్తు చేశారు. ఢిల్లీ, ఖరగ్ పూర్, కాన్పూర్, బెంగళూరు ఐఐటీల్లో 100 శాతం ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపారు.
కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక అంశాలకు దోహదపడేలా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలన్నారు.పరిశోధనలు చేపట్టడంలో, వినూత్న ఆవిష్కరణల్లో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన రంగంలో చాలా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మేధావుల కొత్త ఆలోచనలకు విశ్వవిద్యాలయాలు వేదికలుగా నిలుస్తున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఓయూ సెంటినరీ బిల్డింగ్‌కు ప్రణబ్ శంకుస్ధాపన చేశారు. గవర్నర్ నరసింహన్ మూడు భాషల్లో సావనీర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రపతికి శాలువా,జ్ఞాపికను అందించిన వీసీ… గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లను ఆత్మీయంగా సత్కరించారు.