2010లో లీడర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరో రానా. దగ్గుబాటి రామానాయుడు వంశం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు దగ్గుబాటి ఫ్యామిలీని వాడుకున్న రానా…తనకు వచ్చిన అవకాశాలకు తోడు టాలెంట్‌ని జోడించి నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారాడు.
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సైతం తనదైన మార్క్‌తో ఇప్పటివరకు 13 సినిమాలు చేసిన రానా బాహుబలితో తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. భల్లాలదేవగా విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తర్వాత వచ్చిన ఘాజీతో వందకోట్ల వసూళ్లను రాబట్టిన రానా నేనే రాజు నేనే మంత్రితో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ప్రస్తుతం రానా చేస్తున్న సినిమాలన్ని రెండు లేదా మూడు భాషల్లో విడుదలవుతున్నాయంటే రానా రేంజ్ ఏంటో అర్దం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 1945తో పాటు కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ సినిమాల్లో నటించనున్నాడు. ఇవి రెండు ద్విభాష చిత్రాలు కావడం విశేషం.
ఈ రెండు సినిమాలు పట్టాలపై ఉండగానే మరోసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు భల్లాలదేవుడు. అలనాటి బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నా నటించిన ‘హాథీ మేరా సాథీ’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుందని తెలిపిన రానా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు. ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండటం విశేషం. మొత్తంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే రానా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్,బాలీవుడ్‌లో తన సత్తాచాటుతున్నాడు.