గ్రీన్‌ల్యాండ్..ట్రంప్‌కు డెన్మార్క్ హెచ్చరిక!

5
- Advertisement -

గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. డెన్మార్క్ భూభాగంపై ఎవరు దాడి చేసినా సైన్యం ఆదేశాలు ఎదురుచూడకుండా వెంటనే ఎదురుదాడి చేసి కాల్పులు జరుపుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రకటన 1952లో జారీ చేసిన కోల్డ్‌వార్ కాలం నాటి ఆదేశాలను గుర్తు చేస్తోంది. విదేశీ దళాలు డెన్మార్క్ భూభాగాన్ని ముప్పు పెడితే, కమాండర్ల ఆదేశాలు లేకుండానే ముందుగా కాల్పులు జరపాలన్నదే ఆ ఆదేశాల సారాంశమని స్థానిక పత్రిక బెర్లింగ్స్కే వెల్లడించింది.

ఈ 1952 ఆదేశాలు 1940 ఏప్రిల్‌లో నాజీ జర్మనీ డెన్మార్క్‌పై దాడి చేసినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలిన నేపథ్యంలో రూపొందించబడినవని, ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయని డెన్మార్క్ తెలిపింది. గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ ఆధీనంలోని స్వయం పాలిత ప్రాంతం. అయితే ట్రంప్ పదే పదే గ్రీన్‌ల్యాండ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటామని, అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడబోమని వ్యాఖ్యానించారు. ఆర్కటిక్ ప్రాంతంలో రష్యా, చైనా నౌకల ఉనికి కారణంగా గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమని ఆయన వాదించారు.

దీనిపై డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ రెండూ స్పష్టంగా స్పందించాయి. “గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదు” అని తేల్చిచెప్పాయి. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సెన్ మరింత కఠినంగా స్పందిస్తూ, నాటో సభ్యదేశమైన డెన్మార్క్‌పై అమెరికా సైనిక దాడి చేస్తే అది నాటోకు ముగింపు అవుతుందని హెచ్చరించారు. “అమెరికా మరో నాటో దేశంపై సైనికంగా దాడి చేస్తే, అంతా ఆగిపోతుంది” అని ఆమె డానిష్ బ్రాడ్‌కాస్టర్ TV2కి తెలిపారు.

ఈ నేపథ్యంలో డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ ప్రతినిధులు వాషింగ్టన్‌లో దౌత్య ప్రయత్నాలు ప్రారంభించారు. డెన్మార్క్ రాయబారి జెస్పర్ మోలర్ సోరెన్సన్, గ్రీన్‌ల్యాండ్ ప్రతినిధి జాకబ్ ఇస్బోసెథ్సెన్ వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారులతో సమావేశమయ్యారు. ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకునే ఆలోచనల నుంచి వెనక్కి తగ్గేలా ఒత్తిడి చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే వారం డెన్మార్క్ అధికారులతో సమావేశం కావాల్సి ఉంది.

Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

- Advertisement -