నోట్ల రద్దు నిర్ణయం అనాలోచిత చర్యని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిది కాదని ముందుగానే ప్రభుత్వాన్నిముందుగానే హెచ్చరించానని తెలిపారు. ఏ సంస్కరణైనా సమర్థ ప్రణాళికతోనే విజయవంతమవుతుందన్నారు. కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో మాట్లాడిన రఘురాం నోట్ల రద్దు నిర్ణయాన్ని అయినా సరైన ప్రణాళికతో అమలు చేశారా అంటే అది కూడా లేదని అన్నారు.
పెద్ద నోట్ల ప్రభావం భవిష్యత్‌లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమే పడిందన్నారు. నోట్లు అందుబాటులోకి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. స్థూల దేశీయోత్పత్తిపై 1.5-2% వరకు భారం పడిందని అంచనా వేస్తున్నారని తెలిపారు.
భారత్‌లోని కొన్ని బ్యాంకుల్లో పటిష్ఠ వ్యవస్థలు లేకపోవడం వల్లే పీఎన్‌బీ కుంభకోణం లాంటివి వెలుగులోకి వస్తున్నాయి. వ్యవస్థాగత లోపాల వల్లే కొందరు ఉద్యోగులు, మధ్యవర్తులు కుమ్మక్కయి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే పీఎన్‌బీ కుంభకోణం పూర్తిగా సైబర్ అంశానికి సంబంధించింది. ఈ కుంభకోణం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా వివరాలు బయటకు రావాల్సి ఉంది. భారత్ గురించి తెలిసిన వారెవరికైనా వ్యవస్థాగత లొసుగులను ఇక్కడ ఎంత త్వరగా వెతికేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ రద్దు చేసిన నోట్లన్నీ తిరిగి వచ్చేసినా కూడా ఈ నిర్ణయం వెనక ఉద్దేశం ప్రత్యక్షంగా నెరవేరకపోయేదే అన్నారు.
దేశంలో చలామణిలో ఉన్న 87.5 శాతం నోట్లను రద్దు చేస్తున్నప్పుడు ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమని చెప్పారు. రద్దు చేస్తున్న మొత్తం నోట్ల విలువకు సమానమైన నోట్లను ముందుగానే ముద్రించుకొని ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తే బాగుండేదని తెలిపారు. ఇవన్నీ చేయకుండానే భారత్ పెద్ద నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకుందని అన్నారు.
పెద్ద నోట్లను రద్దు చేసేస్తే, అప్పటివరకు పన్నులు కట్టకుండా డబ్బును దాచుకున్నవారు రాత్రికి రాత్రే బయటకు వచ్చేసి క్షమించండి… మేం ఈ డబ్బులున్న విషయాన్ని మీ దగ్గర దాచాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని పన్ను కింద జమచేసుకోండని అంటారని అనుకోవడం మన భ్రమే అవుతుందన్నారు.