ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ తన గోప్యతా హక్కులు, వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘించబడ్డాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి తన ముఖ కవళికలు, స్వరం, పోలిక, వ్యక్తిత్వాన్ని మార్ఫింగ్ చేసి డీప్‌ఫేక్ కంటెంట్ రూపొందించారని పిటిషన్‌లో ఆరోపించారు.
తన పేరుతో రూపొందించిన “AI లవ్ స్టోరీ” అనే చిత్రంలో AI డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన ఇమేజ్‌ను దుర్వినియోగం చేశారని నందన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన పేరుతో పెద్ద సంఖ్యలో నకిలీ ఖాతాలు, పేజీలు నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, “AI లవ్ స్టోరీ” సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది.కృత్రిమ మేధస్సు, డీప్‌ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకిరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం స్పష్టమైన దోపిడీగా అభివర్ణించింది హైకోర్టు. వక్రీకరించిన కంటెంట్ ద్వారా అతని ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా గోప్యతా హక్కులు ఉల్లంఘించబడ్డాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అలాగే నకిలీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించాలని, సంబంధిత ఖాతాల IP అడ్రస్ వివరాలను బహిర్గతం చేయాలని మెటా, గూగుల్ (యూట్యూబ్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ కేసును జస్టిస్ తుషార్ రావు గెడెలా ధర్మాసనం విచారిస్తోంది.అకిరా నందన్ తరఫున సీనియర్ న్యాయవాది జె. సాయి దీపక్ వాదనలు వినిపించారు.గూగుల్ తరఫున ఆదిత్య గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ న్యాయవాదులు హాజరయ్యారు.
Also Read:పవన్‌పై భూమిక చావ్లా ప్రశంసలు

