సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన..ఢిల్లీ

221
- Advertisement -

వార్నర్‌సేనకు షాక్‌. ప్లేఆఫ్‌ అవకాశాలు అడుగంటిపోతున్న దశలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఎట్టకేలకు పుంజుకుంది. బ్యాటుతో సమష్టిగా రాణించి పరాజయపరంపర నుంచి బయటపడింది. సన్‌రైజర్స్‌ పదునైన బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న దిల్లీ.. ఐదు ఓటముల తర్వాత తిరిగి విజయాన్నందుకుంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మళ్లీ గెలుపు రుచిచూసింది. బ్యాటింగ్‌లో కలసికట్టుగా రాణించిన ఆ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బలమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. యువరాజ్‌ (70 నాటౌట్‌; 41 బంతుల్లో 11×4, 1×6) చెలరేగడంతో మొదట సన్‌రైజర్స్‌ 3 వికెట్లకు 185 పరుగులు సాధించింది. అండర్సన్‌ (41 నాటౌట్‌; 24 బంతుల్లో 2×4, 3×6), కరుణ్‌ నాయర్‌ (39; 20 బంతుల్లో 5×4, 2×6), రిషబ్‌ పంత్‌ (34; 20 బంతుల్లో 4×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (33; 25 బంతుల్లో 1×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని దిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్లేఆఫ్‌ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది.

Delhi Daredevils beat Sunrisers

ఛేదనలో అందరూ..: కరుణ్‌ నాయర్‌ చెలరేగడంతో ఛేదనను ఢిల్లీ ఘనంగా ఆరంభించింది. పవర్‌ప్లే ముగిసే సమయానికే 62/1తో నిలిచింది. కౌల్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదిన కరుణ్‌.. హెన్రిక్స్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. శాంసన్‌ (24; 19 బంతుల్లో 2×4, 1×6) కూడానే బాగానే ఆరంభించినా సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఔటయ్యాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే అదే ఓవర్లో నాయర్‌ కూడా ఔట్‌ కావాల్సింది. కానీ భువనేశ్వర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయాడు. కానీ కరుణ్‌ అదృష్టం ఎంతోసేపు నిలువలేదు. ఎనిమిదో ఓవర్లో కౌల్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌ చేతికే చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఐతే మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ నిలవగా.. పంత్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తూ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. జట్టు స్కోరు 109 దగ్గర పంత్‌ ఔటయ్యాక శ్రేయస్‌ జోరందుకున్నాడు. యువరాజ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కోరె అండర్సన్‌తో నాలుగో వికెట్‌కు 39 పరుగులు జోడించిన అతడు 16వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 148. ఒత్తిడిని పెంచి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుందామనుకున్న సన్‌రైజర్స్‌ ఆశలపై అండర్సన్‌ నీళ్లు చల్లాడు. వేగంగా ఆడిన అతడు.. మోరిస్‌ (15 నాటౌట్‌; 7 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు.

Delhi Daredevils beat Sunrisers

చెలరేగిన యువి: ఎప్పుడో టోర్నీ ఆరంభంలో ఓ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన యువరాజ్‌ ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. అతడు ఉన్నట్లే తెలియలేదు. కానీ టోర్నీ కీలక దశలో మళ్లీ ఫామ్‌ను అందుకున్నాడు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ స్కోరును అందించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు సన్‌రైజర్స్‌కు వార్నర్‌ (30; 21 బంతుల్లో 4×4, 1×6), ధావన్‌ (28; 17 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఎడాపెడా బౌండరీలు బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆరో ఓవర్లో షమి బౌలింగ్‌లో వార్నర్‌ బౌల్డయ్యేటప్పటికి స్కోరు 53 పరుగులు. ఆ తర్వాత విలియ్సమన్‌ (24; 24 బంతుల్లో 1×4, 1×6) అంత ధాటిగా ఆడకపోవడంతో స్కోరు వేగం తగ్గింది. పది ఓవర్లయ్యేసరికి ధావన్‌ వికెట్‌నూ చేజార్చుకున్న సన్‌రైజర్స్‌ 83/2తో నిలిచింది. ఐతే ఆరంభంలో యువరాజ్‌ కూడా ధాటిగా ఆడకపోవడంతో స్కోరు వేగం అందుకోలేదు. తొలి 14 బంతుల్లో అతడు చేసింది 8 పరుగులే. ఈ లోపు విలియమ్సన్‌ కూడా వెనుదిరిగాడు. ఐతే ఎదుర్కొన్న 15 బంతికి (14వ ఓవర్‌) తొలి ఫోర్‌ సాధించిన యువీ, ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఆఖరి వరకు అదే జోరును కొనసాగించాడు. మరోవైపు హెన్రిక్స్‌ అండగా నిలవగా చక్కని షాట్లతో అలరించాడు. చకచకా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. రబాడ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. ఆ ఓవర్లో యువీ 4, 6 కొట్టగా.. హెన్రిక్స్‌ (25 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4) రెండు ఫోర్లు దంచాడు. తర్వాత మోరిస్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ వరుసగా రెండు ఫోర్లు బాది అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో మరో నాలుగు ఫోర్లు కొట్టి స్కోరును 180 దాటించాడు. రబాడ 4 ఓవర్లలో 59 పరుగులిచ్చాడు.

Delhi Daredevils beat Sunrisers

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) షమి 30; ధావన్‌ (సి) అయ్యర్‌ (బి) మిశ్రా 28; విలియమ్సన్‌ (సి) మోరిస్‌ (బి) షమి 24; యువరాజ్‌ సింగ్‌ నాటౌట్‌ 70; హెన్రిక్స్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185; వికెట్ల పతనం: 1-53, 2-75, 3-92; బౌలింగ్‌: జయంత్‌ యాదవ్‌ 4-0-26-0; రబాడ 4-0-59-0; మోరిస్‌ 4-0-36-0; షమి 4-0-36-2; మిశ్రా 4-0-23-1

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఇన్నింగ్స్‌: సంజు శాంసన్‌ (సి) ధావన్‌ (బి) సిరాజ్‌ 24; కరుణ్‌ నాయర్‌ (సి) భువనేశ్వర్‌ (బి) కౌల్‌ 39; రిషబ్‌ పంత్‌ (బి) సిరాజ్‌ 34; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) సిరాజ్‌ (బి) భువనేశ్వర్‌ 33; అండర్సన్‌ నాటౌట్‌ 41; మోరిస్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 189; వికెట్ల పతనం: 1-40, 2-72, 3-109, 4-148; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-33-1; మహ్మద్‌ సిరాజ్‌ 4-0-41-2; సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-38-1; హెన్రిక్స్‌ 2.1-0-36-0; రషీద్‌ఖాన్‌ 4-0-24-0; యువరాజ్‌ 1-0-16-0

- Advertisement -