సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా పద్మావతి. మేవాడ రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ చిత్రం కోసం నటులు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌ల కంటే దీపికా పదుకునేకు ఎక్కువ పారితోషికం ముట్టిందని గతంలో బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీని గురించి దీపికాను ప్రశ్నించగా ఆమె తికమక సమాధానం చెప్పింది.
రీసెంట్ గా ఈ చిత్రానికి 3డీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొనే.. ‘నా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడడం నాకు అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు. వారు నాకు ఇచ్చిన మొత్తంపై నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను’ అని చెప్పింది దీపిక. ఈ చిత్రంపై దర్శక నిర్మాతలు వెచ్చించిన మొత్తం.. పెట్టుబడి చూసి.. తనపై ఇంతగా ఇన్వెస్ట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు దీపికా పదుకొనే చెప్పింది. ఇండియన్ స్క్రీన్ పై ఇదో బిగ్గెస్ట్ మూవీ అంటున్న దీపిక.. ఈ సినిమా ఇండియన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్మకంగా ఉన్నానని అంటోంది.
అయితే ఈ సినిమా కోసం దీపికాకు రూ. 13 కోట్లు, రణ్‌వీర్, షాహిద్‌లకు రూ. 10 కోట్ల చొప్పున పారితోషికం అందినట్లు వచ్చిన వార్తల విషయంపై దీపికాను ప్రశ్నించగా… ‘బడ్జెట్, నిర్మాణ విలువల విషయంలో ఇది చాలా పెద్ద సినిమా. బలమైన మహిళా పాత్రలు ఉన్న సినిమాలు మనం చాలానే చూశాం. కానీ మహిళా పాత్రలు ఇంత గొప్పగా సత్తాతో కూడా ఉంటాయన్న విషయంలో మాత్రం ఈ సినిమా మొదటిదే అవుతుందనుకుంటున్నాను’ అంది. గత కొన్నేళ్లుగా సినీరంగంలో నటీమణులు, నటుల పారితోషికాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందనే విషయం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే దీపికా చెప్పిన మాటలు పరోక్షంగా తనకు ఎక్కువ పారితోషికం ముట్టిన విషయం స్పష్టం అవుతుంది.