తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ఆ పార్టీ సీనియర్ నేతలు గులాబీ గూటికి చేరగా ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. త్వరలో టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మాజీ కేంద్రమంత్రి,సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ.
సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీచేసుందుకు చివరివరకు ప్రయత్నించారు దత్తాత్రేయ. అయితే ఆయనకు మొండిచేయి చూపుతు మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి సీటు కేటాయించింది బీజేపీ. దీంతో పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్న దత్తాత్రేయ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
దత్తన్న బీజేపీని వీడితే ఆ పార్టీకి గట్టిషాక్ తగిలే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుండి నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన దత్తాత్రేయ వాజ్‌పేయి,మోడీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. దసరా సందర్భంగా దత్తన్న నిర్వహించే అలాయ్ భలాయ్ ఫేమస్. అన్నిపార్టీల నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించే దత్తాత్రయే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.