రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని బానిస బతుకు బతుకడం ఇష్టం లేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో 2013లో జరిగిన జైపూర్ చింతన్ శిబిర్‌లో రాహుల్ ప్రసంగం విని ఉత్తేజితుడై 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరాను. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఏఐసీసీ అధికార ప్రతినిధి స్థాయికి చేరుకున్నాని అన్నారు. సోనియా, రాహుల్ చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధంగా తెలంగాణలో జరుగుతోంది. 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా తెలంగాణ ఇస్తే ఆ సిద్ధాంతాలను తుంగలో తొక్కి రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు. రేవంత్ తప్పులను సరి చేయాల్సిన ఏఐసీసీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్, వ్యూహకర్త సునీల్ కూడా పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు నివేదికలిస్తూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది చాలా దుర్మార్గం రాజకీయాలు కులాలు మతాలు ప్రాంతాలకతీతంగా ఉండాలనేది కాంగ్రెసు సిద్ధాంతం…. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏఐసీసీ ముఖ్య నాయకులు కూడా దీన్ని సరిదిద్ధే ప్రయత్నం చేయడంలేదు. కొప్పుల రాజు, జైరాం రమేష్ లాంటి వారు తెలంగాణ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇవాళ వారు కూడా స్పందించలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీలో బీసీ, ఎస్టీలను బలహీనపరుస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకు నలుగురైదుగురు నాయకులను నియమించి పార్టీని నాశనం చేస్తున్నారు. ఏఐసీసీ నుంచి ఒక ప్రాంఛైజీ తెచ్చుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. టీపీసీసీకి గుత్తేదారు అయినట్టు నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మాఫియా తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలో చేరింది బానిసలుగా బతికేందుకు కాదు. ఏడాది కాలంగా ఎన్నో బాధలు తట్టుకున్నా నా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని దాసోజు శ్రవణ్ ప్రకటించారు.