భజనలు చేయకుండా ఉన్నది ఉన్నట్లు ముక్కసూటిగా మాట్లాడే మనిషి దాసరి నారాయణరావు. ఆయన విమర్శించదలుచుకున్న మనిషి ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టరు. ఎవరినైనా పబ్లిక్ గా విమర్శించేస్తారు. ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లకు దాసరి వస్తున్నారంటే అక్కడ ఎవరిని టార్గెట్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆయన మాట్లాడేవాటిలో అబద్ధాలేవీ ఉండవని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. తాజాగా ఓ ఓ కొత్త సినిమా ప్రారంభోత్సవం సంధర్బంగా హీరోయిన్లు తెలుగులో మాట్లాడకపోతే, తాను ఫంక్షన్స్ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలుపుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు దాసరి. తెలుగు చిత్ర పరిశ్రమ ఆంగ్ల చిత్ర పరిశ్రమగా మారిపోతోందని, ఆర్టిస్టులు ముఖ్యంగా హీరోయిన్లు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని దర్శకరత్న దాసరి ఆరోపించారు.
ఏ భాష నుంచి వచ్చిన హీరోయిన్లయినా, వారిని తెలుగు పరిశ్రమ గౌరవిస్తుందని, కాబట్టి వారంతా తెలుగు నేర్చుకుని రావాలని తాను సిన్సియర్ సలహా ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడు వేదికపై ఉన్న హీరోయిన్లు రాయ్ లక్ష్మి, నికిషా పటేల్, అరుంధతీ నాయర్ లు తదుపరి స్టేజ్ ఎక్కేలోగా తెలుగులో మాట్లాడాలని, లేకుంటే ఆ సభ నుంచి తాను వెళ్లిపోతానని అన్నారు.