రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని..మహాకుటమి వల్ల తెరాసకు కలిగే నష్టం ఏమీ లేదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని… కానీ ఇక్కడ కూటమి పేరుతో కుట్రలు చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు నేతలు శుక్రవారం దానం సమక్షంలో తెరాసలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వచ్చే ఎన్నికల్లో సీఎ కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పదవి ఆశించి టీఆర్‌ఎస్ పార్టీలో చేరలేదని, పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రం ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలను టీఆర్‌ఎస్ వైపు ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందని దానం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు తెరాస ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారన్నారు. రాష్ట్రంలో 75శాతం మంది ప్రజలు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు సర్వే తేలిందని దానం తెలిపారు.