గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మించిన మోడల్ మార్కెట్లను సాధ్యమైనంత త్వరగా నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఆదేశించారు. ఈ రోజు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంతో పాటు జోనల్, డిప్యూటి కమిషనర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నగరవాసులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు 43 మోడల్ మార్కెట్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టగా వీటిలో అధికశాతం నిర్మాణం పూర్తి అయ్యి స్వల్ప కారణాలచే ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ మోడల్ మార్కెట్లను వెంటనే తనిఖీచేసి వాటి ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించాల్సిందిగా జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ మోడల్ మార్కెట్లలో షాపులను ఎస్సీ, ఎస్టీలకు సంబంధిత జిల్లా సహకార సంస్థల ద్వారా కేటాయించాల్సి ఉందని, లబ్దిదారుల జాబితాలను వెంటనే ఎంపికచేసి జీహెచ్ఎంసీకి సమర్పించాల్సిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయనున్నట్టు తెలిపారు.
నగరంలోని వివిధ పార్కుల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్‌లు నగరవాసులకు పూర్తిస్థాయిలో సద్వినియోగం అవుతున్నాయని, అయితే వీటి నిర్వహణకు తగు ప్రమాణాలతో కూడిన నిబంధనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రేటర్ పరిధిలో మరో 38 పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉందని, ఈ జిమ్‌ల ఏర్పాటుకు టెండర్లను పిలిచినప్పటికీ సరైన స్పందన లేదని అధికారులు కమిషనర్‌కు వివరించారు. కాగా న్యూ ఢిల్లీ, బెంగళూర్ నగరాల్లో ఓపెన్ జిమ్‌ల నిర్వహణ సమర్థవంతంగా సాగుతుందని, ఆయా నగరాల్లో నిర్వహణ నిబంధనలను పరిశీలించి వాటికి అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందిస్తూ తిరిగి టెండర్లను పిలువాలని దానకిషోర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న ఓపెన్ జిమ్‌లను తనిఖీలు నిర్వహించి ఏమైన చెడిపోయిన పరికరాలు ఉంటే వాటి స్థానంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని డిప్యూటి, జోనల్ కమిషనర్లు సూచించారు. ఓపెన్ జిమ్‌ల నిర్వహణపై పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తవాలను ప్రస్తావిస్తూ కే.బి.ఆర్. పార్కు వాకింగ్ ట్రాక్‌పై ఏర్పాటుచేసిన ఓపన్ జిమ్ నిర్వహణపై తగు చర్యలను తీసుకోవాలని పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు వాకింగ్ ట్రాక్ పైకార్పొరేట్ సోషల రెస్పాన్స్ బులిటీలో భాగంగా ప్రైవేట్ సంస్థ ఈ ఓపెన్ జిమ్ ఏర్పాటుచేసి నిర్వహణను వదిలేసందని, దీంతో ఓపెన్ జిమ్ పరికరాలు పాడైపోయి పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తున్నాయని కమిషనర్‌కు వివరించారు. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటులో పరికరాల ప్రమాణాలు, వాటి నిర్వహణ, బాద్యతలు తదితర అంశాలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఇందుకు ప్రత్యేక కమిటీ వేస్తున్నట్టు కమిషనర్ వెల్లడించారు. అదేవిధంగా పలు పార్కుల్లో నిర్వహణ లోపంతో ఉన్న పిల్లల ఆట వస్తువులకు కూడా మరమ్మతులు నిర్వహించాలని పేర్కోన్నారు.
జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలకు చెందిన కోర్టుకేసులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, ఈ కోర్టు కేసుల పరిష్కారంపై ఈ వారాంతంలోగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబందించి అధిక మొత్తంలో కేసులు ఉన్నాయని, ఈ కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేయడం, కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయడం తదితర లీగల్ అంశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులపై హైకోర్టు రిటైర్డ్ జరడ్జీలతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా సాయంత్రవేళ గార్బేజ్‌ను ఎత్తివేయాలని నిర్ణయించామని, ఇందుకుగాను ప్రతి సర్కిల్‌కు నాలుగు వాహనాలు, ఒక బాబ్‌కాట్‌లను కేటాయిస్తున్నామని, వీటి టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందని పేర్కొన్నారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల ఎత్తివేతకు ప్రత్యేకంగా 150వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని, 15 రోజుల్లోగా ఈ వాహనాలను నగరంలో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చేవారి పట్ల గౌరవం, హుందాతో వ్యవహరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.