గ్రేటర్‌లో పనుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ

558
dana kishore
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసి, జలమండలి, విద్యుత్, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లతో పాటు దాదాపు 10కి పైగా ప్రభుత్వ శాఖలు ప్రజా అవసరాల నిమిత్తం రోడ్ల తవ్వకం, మరమ్మతులు, నిర్మాణం చేపడుతున్నాయి. ఈ పనుల నిర్వహణ సమయంలో తగు నాణ్యత ప్రమాణాలతో పనుల నిర్వహణ, జాగ్రత్తలు చేపట్టడం, పనులు జరిగే చోట సేఫ్టి చర్యలు చేపట్టడం, అనుమతులను పరిశీలించడం తదితర పనులన్నింటిని పర్యవేక్షించేందుకు స్వచ్ఛందంగా పనిచేసే ప్రత్యేక వ్యవస్థ (థర్డ్ పార్టి)ని ఏర్పాటు చేయాలని నేడు జరిగిన సిటీ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు.

బేగంపేట్ హైదరాబాద్ మెట్రో రైలు కార్యాలయంలో జరిగిన సిటీ సమన్వయ సమావేశానికి జిహెచ్ఎంసి కమిషనర్ ఎం.దానకిషోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డి ఎన్.వి.ఎస్ రెడ్డి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయల అభివృద్ది సంస్థ ఎం.డి వెంకటనర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ లతో పాటు వివిధ శాఖల చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ పరిధిలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు చేపట్టేందుకు సిటీ కన్వర్జెన్స్ సమావేశం ప్రతి నెలా నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నఇంజనీరింగ్ పనులను నియమ నిబంధనల ప్రకారం చేపట్టేలా ప్రత్యేక పర్యవేక్షణకు రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన థర్డ్ పార్టి విభాగాన్ని ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ ప్రతిపాదించగా ఇందుకు అన్ని శాఖల అధికారులు ఆమోదించారు.

ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విభాగం ఏర్పాటుకు ఒకొక్క శాఖ మూలధనంగా రూ. 10 లక్షలు ప్రత్యేకంగా కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విభాగంలో ఉండే సీనియర్ ఇంజనీర్లు నగరంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు ముఖ్యంగా రోడ్ల తవ్వకాలు, నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తారని, ఈ పనులకు జిహెచ్ఎంసి లేదా ఇతర శాఖల ముందస్తు అనుమతులు ఉన్నాయా లేదా, ఉంటే అనుమతి పొందిన గడువులోపు పనులు పూర్తిచేయడం, ఖరారైన టెండర్ల ప్రమాణికంగా పనులు నిర్వహించడం, తిరిగి పునరుద్దరణ పనులు చేపట్టే అంశాలను పూర్తిస్థాయిలో స్వతంత్రంగా తనిఖీ చేస్తారని దానకిషోర్ వివరించారు. రోడ్ల తవ్వకాలను అనుమతిలేకుండా చేపట్టడం, తవ్విన రోడ్లను తిరిగి పునరుద్దరించకపోవడం, టెండర్ పొందిన మేరకు పనులు నిర్వర్తించకపోవడం, పనులు జరిగే ప్రాంతాల్లో పనుల వివరాలు పూర్తిచేసే గడువు, కాంట్రాక్టర్ వివరాలు, పర్యవేక్షించే ఇంజనీర్ల పేర్లు, మొబైల్ నెంబర్లతో కూడిన బోర్డులను ప్రదర్శించడం, చుట్టూ సేఫ్టి భారీకేడింగ్ ఏర్పాటు తదితర అంశాలను తనిఖీ చేసి ఏవిధమైన లోటుపాట్లు ఉన్నా సంబంధిత శాఖకు జరిమానా విధించే అధికారాలను ఈ ప్రత్యేక విభాగానికి కల్పించనున్నట్టు కమిషనర్ దానకిషోర్ తెలిపారు.

ఈ థర్డ్ పార్టి విభాగం చేపట్టే జాబ్ చార్ట్, అధికారాలు, దీనిలో ఉండే అధికారుల వివరాలు, విధించే పెనాల్టీ తదితర అంశాలను నిర్థారించడానికి జిహెచ్ఎంసి, జలమండలి, హైదరాబాద్ మెట్రోరైలు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ట్రాన్స్ కో, హెచ్.ఎం.డి.ఏ, జాతీయ రహదారులు తదితర శాఖల చీఫ్ ఇంజనీర్లతో ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. నగరంలోని పలు రహదారుల పక్కన వివిధ శాఖలకు చెందిన విద్యుత్ స్తంభాలు, నిర్మాణ సామాగ్రి, భారీ దిమ్మెలు, పాత వాహనాలు తదితర వస్తువులు ఉన్నాయని, తద్వారా రోడ్లపై ప్రయాణించే పలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వీటిని వెంటనే ఆయా విభాగాలు తొలగించాలని దానకిషోర్ తెలిపారు.

లేనట్టైతే జిహెచ్ఎంసి ద్వారా వాటిని తొలగించి తగు చార్జీలను విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 20 ఎస్.టి.పిల ద్వారా వచ్చే శుద్ది చేసిన జలాలను నగరంలోని ఉద్యానవనాలకు ఉచితంగా అందజేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ లో నిరుపేదలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు ఉచితంగా నల్లా కనెక్షన్లు వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై 9,200 గుంతలు ఏర్పడగా దాదాపు 8వేల గుంతలను పూడ్చివేయడం జరిగిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ తెలిపారు. దెబ్బతిన్న రోడ్డు మార్గాలను పునరుద్దరించేందుకు రూ. 44 కోట్లతో 221 పనులను చేపట్టగా వీటిలో 170 పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు.

మిగిలినవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్దంగా జరిగే అక్రమ కట్టడాలు, ఫుట్ పాత్ ఆక్రమణలు, రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలను వేయడం, స్వచ్ఛత ఉల్లంఘనలు తదితర పనులను గుర్తించి బాధ్యులకు భారీ ఎత్తున జరిమానాలు విధించడానికి రూ. 25 కోట్ల వ్యయంతో 75 కెమెరాలు ఏర్పాటు చేసిన వాహనాలను జిహెచ్ఎంసి సమకూర్చుకోనుందని, త్వరలోనే వీటిని ప్రవేశపెట్టనున్నట్టు కమిషనర్ దానకిషోర్ తెలిపారు. మలక్ పేట్ రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణకు కావాల్సిన ఆరు ఆస్తులను సేకరించాలని జిహెచ్ఎంసి భూసేకరణ అధికారిని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం సాఫిగా జరిగేందుకు మంజూరుచేసిన పనులను వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు హరిచందన, అద్వైత్ కుమార్ సింగ్, శృతిఓజా, సిక్తాపట్నాయక్, కెనడి, కృష్ణ, జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్లు సురేష్ కుమార్, జియాఉద్దీన్, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, హెచ్.ఎం.డి.ఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, జలమండలి అధికారులు కృష్ణ, ఆర్టిసి, అర్ అండ్ బి, సి.పి.డి.సి.ఎల్, ట్రాన్స్ కో, దక్షణ మధ్య రైల్వే, ట్రాఫిక్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -