సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘దళిత బంధు’పై అవగాహన సదస్సు..

188
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈరోజు ‘తెలంగాణ దళిత బంధు’ పథకంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ముందుగా డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం వుండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఆర్థికాభివృద్ధి వుండే ఇతర రంగాలను గుర్తించి వాటిలో రిజర్వేషన్ లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాటు వంటి వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్, కోళ్ళ పెంపకం, టెంట్ హౌజ్, డైరీ పరిశ్రమ, ఆయిల్, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల ఇండస్ట్రీ, హోటల్, స్టీల్ సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫోటో గ్రఫి, వీడియో గ్రఫీ, సెల్ ఫోన్ షాప్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నీచర్ షాప్, వంటి పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి, దళిత బంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది అని సీఎం తెలిపారు.

దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయానికి అదనంగా, ప్రభుత్వ లబ్ధిదారుని భాగస్వామ్యంతో, శాశ్వత ప్రాతిపదికన ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేస్తుంది. ‘దళిత రక్షణ నిధి’ ని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్ధిదారుల కమిటీతో నిర్వహించబడుతుంది. ఎవరైతే అవకాశం లేక, సహకారం లేక బాధపడుతున్నారో అటువంటి వర్గాలన్నింటికి దళిత బంధు దారులు వేస్తుంది. మీ విజయం ఇతర కులాలకు, వర్గాలకు, పక్క రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశానికే వెలుతురు ప్రసరింపచేస్తుంది. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు కరదీపికలుగా మారాలని సీఎం అన్నారు.

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. సర్కారే స్వయంగా అండగా వున్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని, అంటరాని తనం పేరుతో ఊరవతల వుంచి ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం తెలివి తక్కువ పని, ఇది దుర్మార్గం అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -