రోజువారీ వ్యాయామం, సమతుల్యాహారం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇవి మాత్రమే సరిపోవా? రోజుకు 5 నుండి 7 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తూ, సరైన ఆహార అలవాట్లు ఉన్న ఒక 45 ఏళ్ల వ్యక్తికి గుండెలో రెండు స్టెంట్లు వేయాల్సి వచ్చిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫిట్నెస్పై పూర్తి దృష్టి పెట్టినప్పటికీ, అతను నిర్లక్ష్యం చేసిన ఒకే ఒక్క అలవాటు అతడిని ఆసుపత్రి పాలయ్యేలా చేసింది.
రేడియోలజిస్ట్లు చెబుతున్న ప్రకారం.. సదరు వ్యక్తి కార్పొరేట్ ఉద్యోగ ఒత్తిడి కారణంగా ప్రతిరోజూ కేవలం 5 నుండి 6 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. క్రమం తప్పకుండా రన్నింగ్ చేయడం, పోషకాహారం తీసుకోవడం వల్ల నిద్ర లేమి ప్రభావాన్ని అధిగమించవచ్చని భావించడం అతడు చేసిన అతిపెద్ద పొరపాటు.
వైద్య నిపుణుల ప్రకారం, వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. మనం నిద్రపోతున్న సమయంలోనే శరీరం తన కణజాలాన్ని, ధమనులను (Arteries) మరమ్మతు చేసుకుంటుంది: నిద్రపోయే సమయంలో గుండె వేగం, రక్తపోటు సాధారణ స్థితికి తగ్గుతాయి. కానీ సరిపడా నిద్ర లేకపోతే శరీరం ‘నోర్ఎపినెఫ్రిన్’ వంటి స్ట్రెస్ హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది, ఇది బిపిని పెంచుతుంది.
నిద్ర లేమి వల్ల రక్తనాళాల్లో వాపు పెరిగి, ప్లేక్ (మట్టి/కొవ్వు నిల్వలు) ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. వ్యాయామం ద్వారా వచ్చిన అలసటను “వర్కౌట్ చేశాం కదా” అని సరిపెట్టుకోవడమే నిద్ర అప్పుగా మారుతుంది. దీనిని వ్యాయామం లేదా ఆహారం భర్తీ చేయలేవు. ప్రతి ఒక్కరూ రాత్రి వేళ కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్రపోవాలి.
రోజుకో సమయంలో నిద్రపోవడం కాకుండా, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి మేల్కొనేలా బయోలాజికల్ క్లాక్ సెట్ చేసుకోవాలి. వ్యాయామం శరీరానికి ఎంత మంచిదో, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం గుండె రక్తనాళాలకు అంతకంటే ముఖ్యం. వారానికి ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తామనేది మాత్రమే కాకుండా, రోజూ ఎంత ప్రశాంతంగా నిద్రపోయామనేది కూడా గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకమని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
Also Read:ఎన్టీఆర్ ‘డ్రాగన్’..క్రేజీన్యూస్

