గుడ్డు సుమారుగా 45-50 గ్రాముల బరువుంటుంది. మనం 50 గ్రాముల వరి అన్నం తింటే దాన్నుంచి 160-170 క్యాలరీలు లభిస్తాయి. అదే ఒక గుడ్డు తింటే దాన్నుంచి 75-80 క్యాలరీల శక్తి లభిస్తుంది.
గుడ్డు మనకు తక్కువ క్యాలరీలనిస్తూ, మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను (మాంసకృత్తులను) అధికంగా అందించటం గుడ్డు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గుడ్డునుంచి దాదాపు 7 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అంత మొత్తం ప్రోటీన్ లభించాలంటే మనం దాదాపు 50 గ్రాముల కందిపప్పు తినాలి. ఇంత పప్పును ఒకేసారి తినటం సాధ్యం కాదు.
ఒకవేళ అంత తిన్నా సరిగా జీర్ణం కాదు. పైగా పప్పుల ఖరీదు చాలా ఎక్కువ. పైగా గుడ్డు నుంచి వచ్చే మాంసకృత్తులు చాలా నాణ్యంగా ఉండటమే కాదు.. వీటికి ఇతరత్రా కూడా ఎన్నో సుగుణాలు, ప్రత్యేకతలున్నాయి.
ఒక గుడ్డు నుంచి 1 మిల్లీగ్రాము ఇనుము లభిస్తుంది. ఇది మనకు ధాన్యాల నుంచి పెద్దగా దొరకదు. ముడి శనగల వంటి వాటిల్లో ఉన్నా వాటినెవరూ పెద్దగా తినటం లేదు. ఈ ఇనుముతో పాటు ఫోలిక్ యాసిడ్ (35 మైక్రోగ్రాములు), విటమిన్-బి12 (0.9 మైక్రోగ్రాములు) కూడా గుడ్డులో ఉంటాయి.
గుడ్డు లభించే ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు, ఎదిగే పిల్లలకు చాలా అవసరం. గుడ్డులో ఉండే బి12 అనే విటమిన్ ఎర్రరక్తకణాలు వృద్ధి చెందటానికి, నాడీవ్యవస్థ పనితీరు బాగుండటానికి పనిచేస్తుంది. ఇది కేవలం జంతు సంబంధ పదార్థాల్లోనే ఉంటుంది. అందుకే శాకాహారుల్లో ఇది తరచుగా లోపిస్తుంటుంది. మాంసాహారులు కూడా తరచుగా మాంసం తినరు కాబట్టి రోజూ గుడ్డు తీసుకుంటే బి12 లోపం రాదు.
గుడ్డులోపల ఉన్న పచ్చసొనలో 210 మైక్రోగ్రాముల బీటా కెరటిన్ ఉంటుంది. దీనివల్లే దానికి పసుపు రంగు వస్తుంది. అలాగే సొనలోని ల్యూటిన్, జియాగ్జాంథిన్స్ వంటి రంగు పదార్ధాలూ, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి కంటి ఆరోగ్యానికీ దోహదం చేస్తాయి.
ఇప్పటివరకూ మనం విటమిన్-డి సూర్యరశ్మి ద్వారా వచ్చేస్తుందని భావిస్తూ వచ్చాం. కానీ మనలో విటమిన్-డి లోపం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు ఇటీవలి అధ్యయనాల్లో బయటపడింది. గుడ్డు నుంచి 50 మైక్రోగ్రాముల విటమిన్-డి అందుతుంది కాబట్టి గుడ్డును క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్-డి లోపం బారినపడకుండా చూసుకోవచ్చు.
గుడ్డులో 30 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. రైబోఫ్లావిన్ (విటమిన్ బి2) 0.4 మిల్లీగ్రాములు ఉంటుంది. ఎదుగుదలకు, చర్మం ఆరోగ్యానికి, ఆహారం సరిగా జీర్ణం కావటానికి ఈ రైబోఫ్లావిన్ చాలా అవసరం. ఇది గుడ్డు నుంచి తేలికగా లభిస్తుంది.
మెదడు-నాడీవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన ఖొలీన్ వంటివీ గుడ్డులో ఉంటాయి. వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యకరంగా పెరగటానికి అవసరమైన బయొటిన్ ఉంటుంది. కాబట్టి పోషకాహారానికే కాదు, సౌందర్య పోషణకు, వెంట్రుకలు ఆరోగ్యకరంగా పెరిగేందుకు కూడా గుడ్డు దోహదం చేస్తుంది.
Also Read:నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ప్రియదర్శి