నందమూరి బాలకృష్ణ -క్రిష్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఓ వైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది ఎన్టీఆర్ టీం. ఇప్పటికే ఎన్టీఆర్ సినీ,రాజకీయ జీవితంలో కీలకపాత్రలు పోషిస్తున్న వారి పాత్రలు,వారి లుక్‌లను విడుదల చేస్తు వస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు లుక్‌ని విడుదల చేసింది.
యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. పురుందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రను డాక్టర్ భరత్ రెడ్డి పోషిస్తున్నారు. భరత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌లో బాలకృష్ణ వెనుకనున్న దగ్గుబాటి వెంకటేశ్వరావు పాత్రలో ఆకర్షణగా ఉన్నారు భరత్. తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా వెంకటేశ్వరరావు ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ కనిపించనుంది. ఎన్టీఆర్ హిట్ సినిమాల్లో ఒకటైన వేటగాడు మూవీలోని ఆకు చాటు పిందె తడితే సాంగ్‌ని ఈ సినిమాలో రిమేక్ చేయనున్నారు. సినిమాకు హైలైట్‌గా ఈ సాంగ్ నిలవనుందట. ఎన్టీఆర్ సినీరంగ విశేషాలతో జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు , రాజకీయ విశేషాలతో ఎన్టీఆర్ మహానాయకుడుగా జనవరి 24న సంక్రాంతికి ముందుకురానుంది.