గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో విజయోత్సవ సభను నిర్వహించిన చిత్ర బృందం, డాకు మహారాజ్ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “నేను దైవాన్ని నమ్ముతాను. అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, కళామతల్లి ఆశీర్వాదం. ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్. వరుసగా ఇది నాకు నాలుగో విజయం. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాము. ఆ సినిమా అఖండ విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించింది. ఆ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తాను. ప్రేక్షకులకు ఎటువంటి సినిమా అందించాలనేది నటీనటులు, దర్శకనిర్మాతలు ఆలోచించుకోవాల్సిన విషయం. ‘డాకు మహారాజ్’ కథ అనేది నీటి గురించి. నీటి సమస్య గురించి ప్రజలకు అవగాహన కలిగించిన సినిమా డాకు మహారాజ్. ఒక తెలుగు ఇంజనీర్ రాజస్థాన్ వెళ్లి, అక్కడి ప్రజల కోసం డాకుగా మారడం ఈ సినిమాలో చూశారు. మా సినిమాని ఆదరించి, అఖండమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. ప్రతి నటుడు నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు దర్శకుడు బాబీ. నన్ను ఎంతగానో ప్రేమించి, నాలో ఉన్న నట విశ్వరూపాన్ని ఆవిష్కరించేలా చేశాడు. మంచి సన్నివేశాలతో, క్లుప్తంగా, అందంగా సినిమాని రూపొందించాడు. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు తన ఇంటిపేరు మార్చేశారు. ఎస్.ఎస్.థమన్ కాదు, నందమూరి థమన్ అంటున్నారు. నేనైతే ఇప్పటినుంచి ఎన్.బి.కె. థమన్ అని నామకరణం చేస్తున్నాను. అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. అఖండ తర్వాత నా కాంబినేషన్ లో ప్రగ్యా జైస్వాల్ నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం సంతోషంగా ఉంది. అందం, టాలెంట్ కలగలిపిన నటి శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమాలో బరువైన పాత్రలో అద్భుతంగా నటించింది. ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, కెమెరామ్యాన్ విజయ్ కార్తీక్ గారు, డ్యాన్స్ మాస్టర్లు శేఖర్ మాస్టర్, శివ మాస్టర్.. ఇలా అందరూ నూటికి నూరుపాళ్లు వారి బాధ్యతకు న్యాయం చేశారు. మా నిర్మాత వంశీ గారు నా అభిమాని. ఈ సినిమాలో కొత్త బాలకృష్ణను ఆవిష్కరించాలని ఆయన కల కన్నారు. అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత వంశీ గారు. అటువంటి నిర్మాత నా అభిమాని కావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎన్నో అద్భుతమైన సినిమా తీశారు. మునుముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు తీయాలని ఆశీర్వదిస్తున్నాను. అలాగే వేద అద్భుతంగా తన పాత్రను పోషించింది. మంచి భవిష్యత్ ఉంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. నా వరకు చూసుకుంటే, నా రికార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. డాకు మహారాజ్ విజయంతో ఇది మరోసారి రుజువైంది. ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు నా కృతఙ్ఞతలు. తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించలేకపోయాము. అందుకే జనవరి 22న అనంతపురంలోనే విజయోత్సవ పండుగను జరుపుకోవాలని నిర్ణయించాము. మంచి సినిమాకి మంచి రివ్యూలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లిన పాత్రికేయ మిత్రులకు కృతఙ్ఞతలు.” అన్నారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలలో ఒకటిగా నిలవాలనే ఉద్దేశంతో ‘డాకు మహారాజ్’ను మొదలుపెట్టాము. డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉన్నారు. ఒక దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. బ్లాక్ బస్టర్లు చాలా వస్తాయి. కానీ రెస్పెక్ట్ అరుదుగా వస్తుంది. ‘డాకు మహారాజ్’ సినిమా చూసి ఎందరో నాకు మాస్టర్ పీఎస్ అని మెసేజ్ లు పెడుతున్నారు. బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో ఒక మాస్టర్ పీఎస్ సినిమా ఇవ్వడానికి కారణమైన మా టీం అందరికీ థాంక్యూ సో మచ్. నా రైటింగ్ టీం చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్, నందు, భాను ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. బాలకృష్ణ గారికి బెస్ట్ ఫిల్మ్ ఇస్తానని వంశీ గారికి ముందే ప్రామిస్ చేశాను. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ లు తీయాలి, బెస్ట్ బాలకృష్ణ గారిని చూపించాలి అనుకున్నాను. దర్శకుడిని బాలకృష్ణ గారు ఎంతో నమ్ముతారు. పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు. జైపూర్ సింగల్ టేక్ లో బాలకృష్ణ గారు చేసిన నటన చూసి, అక్కడున్న 400 మంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆయన కథను అర్థం చేసుకొని, దర్శకుడు ఏది అడిగితే అది చేస్తారు. బాలకృష్ణ గారికి సినిమా గురించి, లైటింగ్ గురించి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. డీఓపీ విజయ్ కార్తీక్, ఫియట్ మాస్టర్ వెంకట్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు తమ బెస్ట్ ఇచ్చారు. మా వెనకాల నిలబడి మమ్మల్ని బ్లెస్ చేసిన చినబాబు గారికి స్పెషల్ థాంక్స్. కథకు కీలకమైన నందిని పాత్రకు శ్రద్ధా శ్రీనాథ్ ప్రాణం పోశారు. నిడివితో సంబంధం లేకుండా పాత్రను నమ్మి ఈ సినిమా చేసిన ప్రగ్యా జైస్వాల్ కి థాంక్యూ. వేదకు చాలా టాలెంట్ ఉంది. అనంత శ్రీరామ్ గారు రాసిన ‘చుక్క నీరే’ సాంగ్ సినిమాకి ఎంతో గౌరవం తీసుకొచ్చింది. కాసర్ల శ్యామ్ గారు రాసిన దబిడి దబిడి సాంగ్ కి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా ఎక్కడా బోర్ లేదు, ప్రతి సీన్ ఆసక్తికరంగా ఉంది అనే పేరు రావడానికి ఎడిటర్స్ నిరంజన్, రూబెన్ ప్రధాన కారణం. థమన్ గారు ప్రాణం పెట్టి సంగీతం అందించారు. అభిమానులు నందమూరి థమన్ అని ప్రేమగా పిలుస్తున్నారు అంటే, అది నీ కష్టానికి దక్కిన ఫలితం. నా డైరెక్షన్ టీంకి, సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “నన్ను, దర్శకుడు బాబీని నమ్మి మాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి కృతఙ్ఞతలు. బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాము. అభిమానులు, ప్రేక్షకుల నుంచి మేము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ స్పందన లభించింది. జనవరి 12న ఈ సినిమా విడుదలైతే, సంక్రాంతి పండుగ రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ కి వెళ్లిపోయారు. అది మాకు పెద్ద సక్సెస్. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పుడే నిర్మాతలకు నిజమైన ఆనందం. మా దృష్టిలో అదే పెద్ద హిట్. డాకు మహారాజ్ ఫలితం పట్ల మా ప్రతి డిస్ట్రిబ్యూటర్ సంతోషంగా ఉన్నారు. మాతో పాటు ఈ సంక్రాంతికి దిల్ రాజు గారు, వెంకటేష్ గారు కూడా విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ లో విజువల్స్, నేపథ్య సంగీతం గురించి సినీ పరిశ్రమలో అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు.” అన్నారు.
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “సక్సెస్ చాలా గొప్పది. అది డబ్బు పెడితే దొరకదు. సక్సెస్ అనేది ఎంతో ఎనర్జీ ఇస్తుంది. భవిష్యత్ కి భరోసాను ఇస్తుంది. ఈరోజుల్లో నిర్మాత ఒక విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు. నిర్మాతను అందరూ ఒక దేవుడిలా చూడాలి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే నెగటివిటీని పక్కన పెట్టి, మనమందరం కలిసి మన సినిమాలకు మనమే సపోర్ట్ చేసుకోవాలి. సినిమా వెనుక నిర్మాత డబ్బుతో పాటు, ఎందరో కష్టం దాగి ఉంటుంది. కాబట్టి అలాంటి సినిమాని కాపాడే బాధ్యత మనందరికి ఉంది. ‘డాకు మహారాజ్’ సినిమా విషయానికి వస్తే, శ్రద్ధా శ్రీనాథ్ గొప్ప నటి. కళ్ళతోనే అద్భుతమైన భావాలను పలికిస్తారు. ప్రగ్యా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. వేద క్యూట్ గా ఉంది. అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు గొప్ప సాహిత్యం అందించారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేసిన నా మ్యూజికల్ టీంకి థాంక్స్. ఎంత ఒత్తిడి ఉన్నా అది దర్శకుడు బాబీ ఫేస్ లో కనిపించదు. నేపథ్య సంగీతం విషయంలో బాబీ చేసిన సపోర్ట్ ను మరచిపోలేను. వంశీగారు చాలా నిజాయితీగా ఉంటారు. సినిమా విషయంలో ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. సితార, హారిక హాసిని బ్యానర్స్ హిట్ కొడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వంశీగారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు, నా కాంబినేషన్ లో వరుసగా నాలుగు ఘన విజయాలు సాధించాము. ప్రతి సినిమాలో బాలకృష్ణ గారు నట విశ్వరూపం చూపిస్తున్నారు కాబట్టే, నేను ఆ స్థాయి సంగీతం ఇవ్వగలుగుతున్నాను. బాలయ్య గారిని ఎప్పుడు చూసినా నాకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఈ సినిమాలో బాలయ్య గారిని డీఓపీ విజయ్ కార్తీక్ గొప్పగా చూపించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థాంక్యూ.” అన్నారు.
Also Read:అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి: హరీశ్ రావు