సిద్ధిపేట పోలీస్ కమిషనర్ పేరుతో సైబర్ మోసగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించడం సంచలనంగా మారింది. సీపీ విజయ్ కుమార్ ఫోటో, పేరు ఉపయోగించి కొత్త అకౌంట్ తెరిచిన కేటుగాళ్లు అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. రిక్వెస్ట్ అంగీకరించగానే మెసెంజర్‌లో సందేశాలు పంపుతూ వారి కాంటాక్ట్ నంబర్ అడిగి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం స్వయంగా సీపీ విజయ్ కుమార్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. తన పేరుతో వచ్చిన ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్‌నీ అంగీకరించవద్దని, మెసెంజర్‌లో వచ్చే సందేశాలకు ప్రతిస్పందించవద్దని ప్రజలకు సూచించారు. పోలీస్ అధికారులు, పౌరులకు ఇలాంటి నకిలీ అకౌంట్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే, ఆ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సీపీ విజయ్ కుమార్ అధికారికంగా సమాచారం అందించారు. ప్రస్తుతం సైబర్ పోలీసులు అకౌంట్‌ను ట్రేస్ చేసి, నకిలీ ప్రొఫైల్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారుల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించడం కేసులు అధికమవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలు గమనించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Also Read:ఓట్ల కోసం సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన


