సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. ఈసారి వారి వలలో చిక్కింది సామాన్య ప్రజలు కాదు, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు కావడం గమనార్హం. సైబర్ నేరాలపై అవగాహన ఉన్నవారే మోసపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సమాచారం ప్రకారం, టీటీడీ దర్శనం ఏర్పాటు చేస్తామంటూ ఓ ఇన్‌స్పెక్టర్‌ను నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలు వసూలు చేశారు. మరో ఘటనలో, స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇన్‌స్పెక్టర్లను యాడ్ చేసి, అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. గ్రూప్‌లో ఇతరులు లాభాలు పొందుతున్నట్లు చూపిస్తూ విశ్వాసం కలిగించారు.
ఈ మోసంలో మరో ఇన్‌స్పెక్టర్ నుంచి స్టాక్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.39 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ ఇద్దరూ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్లుగానే గుర్తించబడడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
మోసం జరిగిన విషయం గుర్తించిన వెంటనే బాధిత ఇన్‌స్పెక్టర్లు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సైబర్ నేరగాళ్లు ఎంత చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్నారో స్పష్టం చేస్తోంది. ప్రజలు మాత్రమే కాదు, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read:పెళ్లి తేదీ ప్రకటించిన అల్లు శిరీష్

