విజయవాడలో ట్రాఫిక్ చలాన్ల పేరుతో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని చెబుతూ ఫోన్ మెసేజ్‌లు, వాట్సాప్ లింకులు పంపించి అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మోసాల్లో భాగంగా బాధితులకు ఒక APK ఫైల్‌ను పంపి, దాన్ని డౌన్‌లోడ్ చేసి క్లిక్ చేయించేలా చేస్తున్నారు.
ఇటీవల విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ సైబర్ కేటుగాళ్లు సందేశం పంపారు. అందులో ఉన్న APK ఫైల్‌ను క్లిక్ చేసిన వెంటనే అతని మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణ పొందిన నేరగాళ్లు, అతని క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి ఏకంగా రూ.5 లక్షలను కట్ చేసినట్లు తెలిసింది. కొద్దిసేపటిలోనే ఖాతా నుంచి డబ్బులు మాయమవడంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు.
మోసపోయిన విషయం తెలుసుకున్న వెంటనే బాధితులు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ చలాన్ల వివరాల కోసం అనధికారిక లింకులు, APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ చలాన్ల సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని సైబర్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్!

