కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ గుండెల్లో ముల్లు!

34
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందా ? అధికారం చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు లెక్కకు మించి హామీలను ప్రకటించిన కాంగ్రెస్.. ఆరు గ్యారెంటీ హామీలను మాత్రమే అమలు చేస్తామని చెబుతోంది. వాటి అమలు కూడా వందరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికి అది సాధ్యమయేటట్టు కనిపించడం లేదు. దీంతో మెల్లగా కాంగ్రెస్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలౌతోంది. ముఖ్యంగా కరెంటు బిల్లు విషయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 200 యూనిట్లు ఉచిత కరెంటు అందిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ” నవంబర్ నుంచే ఎవరు కరెంట్ బిల్లు కట్టొద్దని, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజల కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుందని ” ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. .

కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించారు. ఇక వారు భావించినట్లుగానే తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కరెంట్ బిల్లు విషయంలో మీరిచ్చిన హామీలు సంగతేంటి అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన హస్తం నేతలు ఇప్పటివరకు కూడా ఆ హామీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలే ఆ హామీని అమలు చేసుకునే పనిలో ఉన్నారు. కరెంట్ బిల్లు కట్టమని తెగేసి చెబుతున్నారు. దీంతో ప్రజా వైఖరి చూసి కంగుతిన్న ప్రభుత్వ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కరెంటు బిల్లు విషయంలోనే ప్రజలు ఈ స్థాయిలో ఫైర్ అవుతుంటే.. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజాగ్రహానికి లోనయ్యే అవకాశం లేకపోలేదు. మరి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.

Also Read:బాబోయ్.. బాలయ్యతో హాట్ బ్యూటీ

- Advertisement -