వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రారంభించారు. ఈ 14 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఒక్కో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ల బుకింగ్ జరగనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ లేనివారి విషయంలో కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు.
ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 100 మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్‌లో వార్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఈ-పాస్‌బుక్ ఇస్తామన్నారు. మెరూన్ రంగు పాసుపుస్తకాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో 16 లక్షల లావాదేవీల్లో 10 వేలే స్లాట్ బుకింగ్ ద్వారా జరిగేవి అన్నారు. ప్రస్తుతం వంద శాతం స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. రిజిస్ట్రార్లు సహా అధికారులు ఎవరికీ విచక్షణాధికారాలు ఉండవన్నారు. 24 లైన్లతో కాల్ సెంటర్ 18005994788 ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ తెలిపారు.

