2019 – 20 సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖలు బడ్జెట్ ప్రతిపాదనల వివరాలను వెంటనే ఆర్ధిక శాఖ కు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. శనివారం బడ్జెట్ ప్రతిపాదనల పై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ మాసంలో జరిగే అవకాశం ఉన్నదని గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు త్వరలో నే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని, శాఖలు వెంటనే తమ ప్రతి పాదనలు పంపాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
వివిధ శాఖల అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత శాఖ మంత్రులతో సమీక్షా సమావేశాలు వెంటనే పూర్తి చేయాలని సి.యస్ అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను, కేంద్ర బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. గత సంవత్సరపు కేటాయింపులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆదాయాన్ని సమకూర్చే శాఖలు తమ అంచనాల ప్రకారం ఆదాయాల సముపార్జనకు ప్రత్యేక దృష్టితో కృషి చేయాలన్నారు.
ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణా రావు బడ్జెట్ ప్రతిపాదనలలో పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, చిత్రా రామచంద్రన్ , అధర్ సిన్హా, సోమేష్ కుమార్ , శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ, జయేష్ రంజన్ , పార్ధసారథి , వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, జనార్ధన్ రెడ్డి , బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా , నిరంజన్ రావు , వాణిజ్య పన్నులు, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్ , వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా , ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.