తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామని ప్రజాస్వామిక లౌకికవాద శక్తులకు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ది జీవులను మేధావులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
ఈమేరకు శనివారం నాడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభధ్రం, ఆపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీ చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ గారితో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు రాజకీయ జాతీయ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…స్వార్థ రాజకీయాల కోసం, విచ్చిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. వీరి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక వాదులు మేధావులు ప్రజా పక్షం వహించే రాజకీయవేత్తలు కదలిరావాలని తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి, మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చిన సిపిఎం పార్టీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా, మతవిద్వేశ శక్తులకు ఎదుర్కునేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటంలో తాము సంపూర్ణ మద్దతునందిస్తామని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పై సిపిఎం నేతలు సీఎం కేసీఆర్ గారికి వినతిపత్రాన్ని అందించారు.