పౌరసత్వ చట్ట సవరణకి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభ ఆమోదించిన తీర్మానం స్వాగతనీయమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. భారత రాజ్యాంగ మూల సూత్రాలకి విఘాతం కల్గిస్తున్న చట్టాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు రోజులు ఢిల్లీలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఏఏ అంశం హిందూ, ముస్లిం అంటూ రెండు మతాలకి సంబంధించినది కాదని ఆయన చెప్పారు. ఈ చట్టం యావత్ దేశానికే వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.
నిరాక్ష్యరాస్యులైన పేద ప్రజానీకాన్ని బర్త్ తదితర సర్టిఫికేట్తో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. దాంతోపాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ఎన్పీఆర్ ప్రక్రియకి ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పారని… కానీ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మాత్రం ప్రక్రియకి సర్టిఫికేట్‌లు అవసరం అని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వమే రెండు నాల్కల ధోరణి అవలంభించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.