రజనీకాంత్ నటించిన 2014 తమిళ చిత్రం ‘కోచడైయాన్’ నిర్మాతకు కోర్టు నుంచి గట్టి హెచ్చరిక వచ్చింది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జె. మురళీ మనోహర్ నిర్మించారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రానికి విస్తృత స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవసరమయ్యాయి.
సినిమా చివరి దశలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదల చేయడానికి నిర్మాతలు ఓ ప్రకటన, మీడియా సంస్థ నుంచి ఆర్థిక సహాయం తీసుకున్నారు. అయితే ఆ నిధుల తిరిగి చెల్లింపే తర్వాత న్యాయ వివాదానికి దారి తీసింది. 2014లో పోస్ట్ ప్రొడక్షన్, విడుదల ఖర్చుల కోసం తీసుకున్న రుణానికి బదులుగా నిర్మాత వైపు నుంచి చెక్కులు ఇచ్చారు. వాటిలో ఒక చెక్ బౌన్స్ కావడంతో రుణదాత కోర్టులో చెక్ డిషానర్ కేసు దాఖలు చేశాడు.
ఏళ్ల తరబడి విచారణ అనంతరం ట్రయల్ కోర్టు నిర్మాతను దోషిగా తేల్చి, పరిహారం చెల్లించడంతో పాటు స్వల్పకాల జైలు శిక్ష కూడా విధించింది. ఈ తీర్పును నిర్మాత మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నిర్దేశించిన గడువులోగా రూ.2.52 కోట్లను చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఆ గడువు లోపు డబ్బు చెల్లించకపోతే, చెక్ బౌన్స్ కేసులో విధించిన జైలు శిక్షను అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం పూర్తిగా సినిమా నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ చెల్లింపులపై మాత్రమేనని, సినిమా కంటెంట్ లేదా బాక్సాఫీస్ ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదని కోర్టు పేర్కొంది.
Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్

