అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ న్యాయస్థానం సోమవారం ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. డేరా బాబాను కోర్టుకు తరలించే నిమిత్తం బయటకు తెస్తే, మరింత విధ్వంసం జరగవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది.
బాబా రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతం రోహతక్ జైల్లో ఉన్నారు. దీంతో కోర్టును అక్కడికే తరలించాలని హైకోర్టు ఆదేశాలతో నిర్ణయించారు. రోహతక్ జైలులోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి, గుర్మీత్ అక్కడే విచారించి తీర్పును వెలువరించడానికి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదకన జరుగుతున్నాయి.
హైకోర్టు ఆదేశాల ప్రకారం దీనికోసం జైల్లోని ఓ బ్యారక్‌ను ఖాళీ చేయించిన అధికారులు, కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు న్యాయమూర్తికి కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, వాయు మార్గం గుండా తరలించాలని హైకోర్టు పేర్కొంది. రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య తీర్పు విడుదల కానుండగా, పంచకుల, సిర్సా ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతోంది. ఇద్దరు మహిళలపై అత్యాచారంతోపాటు దీన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ హత్య కేసులోనూ దోషిగా తేలిన ఆయనకు 7 నుంచి 10 ఏళ్ల శిక్ష ఖరారయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఆయనకు పై కోర్టులో అపీలు చేసుకునే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి ఇస్తారని, అయితే, వెంటనే బెయిల్ లభించే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది. మరోవైపు గుర్మీత్ తనపై అత్యాచారం చేశారని చెబుతున్న యువతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం.