గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) విభజనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో రెండు వారాల్లో ప్రస్తుత GHMC పాలక మండలి గడువు ముగియనుండటంతో పరిపాలనా స్థాయిలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫిబ్రవరి 10 తర్వాత GHMCను మూడు కార్పొరేషన్లుగా విభజించనుండగా, ఫిబ్రవరి 11న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే వరకు ఈ మూడు కార్పొరేషన్లు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగనున్నాయి.
విభజన తర్వాత మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పడనున్నాయి. అవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు కార్పొరేషన్లకు అవసరమైన కార్యాలయాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. తార్నాక హుడా కార్యాలయంలో గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేయగా, మాదాపూర్ నాక్ బిల్డింగ్‌లో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
వార్డుల పరంగా చూస్తే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 150 వార్డులు, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 76 వార్డులు, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో 74 వార్డులు ఉండనున్నాయి. జోన్ల విభజన కూడా స్పష్టమైంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లు హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పడనుండగా, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ రూపొందనుంది.
Also Read:వాహనాలు షోరూమ్‌ల వద్దే రిజిస్ట్రేషన్
ఇప్పటికే పాలనపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు ఇచ్చారు. గతంలో 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న GHMC, ORR వరకు విస్తరించడంతో ప్రస్తుతం 2050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరింది. జనాభా సుమారు ఒక కోటి 34 లక్షలకు పెరగడంతో పరిపాలన సౌలభ్యం కోసం ఈ విభజన చేపడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. GHMC విభజనతో మెరుగైన పట్టణ పాలన, వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

