శ్రీలంక మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగపై అవినీతి ఆరోపణలు నమోదవడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. పెట్రోలియం మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన అవకతవకల కేసులో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇదే కేసులో ఆయన సోదరుడు దమ్మిక రణతుంగను అరెస్ట్ చేయగా, డిసెంబర్ 16న బెయిల్‌పై విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సోదరుడు దమ్మికను దేశంలోని అవినీతి నిరోధక కమిషన్ (CIABOC – లంచం లేదా అవినీతిపై విచారణ కమిషన్) అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2017లో రాష్ట్ర సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) ద్వారా క్రూడ్ ఆయిల్ కొనుగోలు సమయంలో తప్పుదారి పట్టిన టెండర్ ప్రక్రియ కారణంగా దమ్మికను అరెస్ట్ చేసినట్లు CIABOC వెల్లడించింది. ఆ సమయంలో దమ్మిక CPC చైర్మన్‌గా ఉండగా, అర్జున రణతుంగ పెట్రోలియం పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కేసులో అర్జున రణతుంగను రెండో నిందితుడిగా పేర్కొన్నారు.
Also Read:కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర..
దమ్మిక ప్రభావం వల్ల CPCకి సుమారు 800 మిలియన్ శ్రీలంక రూపాయల నష్టం వాటిల్లిందని CIABOC పేర్కొంది. అయితే అర్జున రణతుంగ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేకపోయామని అధికారులు తెలిపారు. క్రికెట్ విషయానికి వస్తే, దమ్మిక రణతుంగ శ్రీలంక తరఫున స్వల్పకాలం మాత్రమే ఆడారు. 1989–90లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రాతినిధ్యం వహించారు.

