BJP:బీజేపీలో ‘మల్కాజ్ గిరి’ మంట!

22
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి లోక్ సభ ఎన్నికలపై పడింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను మెజారిటీ సీట్లను సొంతం చేసుకోవాలని అన్నీ పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని పార్టీ పెద్దలు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సీటు కాషాయ పెద్దలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందట. అందరి కన్ను ఆ స్థానంపైనే ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతుందట. అదే మల్కాజ్ గిరి సీటు. ఈ సీటు కోసం దాదాపుగా అరడజను మంది పోటీ పడుతున్నారట. .

ఈటెల రాజేందర్, మురళీధరరావు, వీరేందర్ గౌడ్, చాడ సురేష్ గౌడ్, పన్నాల హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కరుణ గోపాల్, మల్క కొమరయ్య, వంటి వారు గట్టిగా పోటీ పడుతున్నట్లు టాక్. గత కొన్నాళ్లుగా మల్కాజ్ గిరి సీటు తనదేనని ఈటెల రాజేందర్ పదే పదే చెబుతూ వస్తున్నారు. మొదట కరీంనగర్ లో ఈటెల పోటీ చేస్తాడని వార్తలు వచ్చినప్పటికీ.. అక్కడ బండి సంజయ్ పోటీలో ఉండడంతో తనకు మల్కాజ్ గిరి సీటు ఖాయమని ఈటెల ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.

కానీ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ఇతర నేతలు కూడా అదే సీటుపై గురి పెట్టడంతో ఇప్పుడు ఆ సీటును అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఈటెల రాజేందర్ కే ఆ సీటు కేటాయిస్తే ఇతర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఈటెలను పక్కన పెడితే ఆయన పార్టీ వీడే అవకాశం కూడా లేకపోలేదు. అసలే గత కొన్నాళ్లుగా ఈటెల పార్టీ మార్పుపై తరచూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి సీటు ఇవ్వకపోతే ఈటెల బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. మరి బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారిన మల్కాజ్ గిరి సీటును ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Also Read:షర్మిల దీక్ష.. ఎవరికి లాభం ఎవరికి నష్టం?

- Advertisement -