ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తన కుడి భుజమని ఆయన్ని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ హుజురాబాద్ అద్భుతమైన చైతన్యం కలిగిన ప్రాంతమన్నారు. సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలిపామన్నారు. ఉచిత కరెంట్ అందిస్తాం..ఏడాదిలోగా ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు.
నాలుగున్నరేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. పేదవాళ్లకిచ్చే ఫించన్లను పెంచుకుంటూ పోతున్నామని చెప్పారు. నిరుద్యోగులకు 3 వేల భృతి ఇస్తామని తెలిపారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలన్నారు. రాబోయే ప్రభుత్వంలో రైతుల కోసం అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు.తెలంగాణ మొత్తాన్ని క్రాప్ కాలనీలుగా విభజిస్తామని తెలిపారు.మహిళా సంఘాలకు ఐకేపీ ఉద్యోగులు అండగా ఉండాలన్నారు. రైతులు పండించే మిరప పంటను కూడా మహిళా సంఘాలే కొనుగోలు చేస్తాయి. పంటలను మహిళా సంఘాలే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. అంగన్ వాడీలు, హోంగార్డులకు అన్ని రాష్ర్టాల్లో కంటే మనమే ఎక్కువ జీతాలు ఇస్తున్నామన్నారు.