ప్రజా ఫ్రంట్‌కి కాంగ్రెస్ రాంరాం..!

209
telangana prajakutami
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌,సీపీఐ,టీజేఎస్,టీడీపీ కలిసి ప్రజాకూటమి (మహాకూటమి)గా ఏర్పాటైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తు టీడీపీ,కాంగ్రెస్ కలిసి పోటీచేసిన ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రజాకూటమికి గట్టిషాకిచ్చారు. ఎన్నికల ఫలితాలను చూసి కూటమి నేతలు ఖంగుతిన్నారు. టీఆర్ఎస్,కేసీఆర్ ప్రభంజనానికి కూటమి నేతలు మట్టికరిచారు. జానారెడ్డి,రేవంత్ మొదలుకొని డికే అరుణ,కొమటిరెడ్డి,చిన్నారెడ్డి,కొండా సురేఖ లాంటి నేతలు ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాకూటమికి రాంరాం చెప్పి ఒంటరిగా పోటీచేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారట. అయితే కొంతమంది నేతలు కూటమిగానే బరిలోకి దిగితే లాభిస్తుందని వాదిస్తుండగా డీకే అరుణ,కొమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు మాత్రం ఒంటరిగానే పోటీచేయాలని పట్టుబడుతున్నారని సమాచారం.

ప్రజా కూటమి వల్ల కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదని వాదిస్తున్నారట. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలంగా ఉన్న స్ధానాలను కొల్పోయామని టీజేఎస్,సీపీఐ కనీసం ఒక్క స్ధానాన్ని కూడా గెలవలేకపోయాయని ఓటింగ్ శాతంతో సహా చూపిస్తున్నారట. టీడీపీ కేవలం రెండు స్ధానాలకే పరిమితం కాగా కొదండ నేతృత్వంలోని జనసమితి కనీసం ఒక్కశాతం ఓటు బ్యాంకును కూడా సాధించలేకపోయిందని ఈ నేపథ్యంలో కూటమిలో కొనసాగడం కంటే ఒంటరిగా పోటీచేయడమే మేలనే ఆలోచనలో మెజారిటీ నేతలు ఉన్నారని సమాచారం.

ఒకవేళ పొత్తు కొనసాగిస్తే ఖమ్మం నుండి టీడీపీ,నల్గొండ లేదా భువనగిరి పార్లమెంట్ నుండి పోటీచేసేందుకు సీపీఐ,టీజేఎస్ సైతం ఒక స్ధానంలో పోటీచేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల వీరికి సీట్లు కేటాయిస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సీనియర్ నేతలు చెబుతున్నారట. గెలుపు ఓటముల సంగతి పక్కనపెట్టి 17 స్ధానాల్లో బరిలో నిలిచేలా హైకమాండ్‌ను ఒప్పించాలని టీపీసీసీ నేతలకు తేల్చిచెబుతున్నారట.

ఈ వాదనలకు బలం చేకూరేలా కాంగ్రెస్ 17 ఎంపీ స్ధానాల్లో పోటీచేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి నెలఖారులోగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అయితే కొంతమంది నేతలు మాత్రం జాతీయ రాజకీయాల దృష్ట్యా ప్రజాకూటమి కొనసాగిస్తినే మంచిదని భావిస్తున్నారు. ఏదిఏమైనా కూటమి నుండి కాంగ్రెస్ బయటకు వస్తే ప్రజాకూటమి ఏర్పాటు మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -