రేవంత్‌పై సీనియర్ల గుస్సా..టీఆర్ఎస్‌లోకి!

100
revanth
- Advertisement -

ఢిల్లీ హైకమాండ్ ఏరికోరి నెత్తినపెట్టుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాహుబలి అన్ని ఓ వర్గం మీడియా ప్రచారం చేసింది. రేవంత్ దూకుడుతో ఇక అధికారంలోకి వచ్చేసినట్లే అని కాంగ్రెసోళ్లంతా కలలు కన్నరు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత రేవంత్ బాహుబలి కాదు..హస్తం పార్టీ పాలిట భస్మాసురుడు అని తేలిపోయింది. రేవంత్‌ రెడ్డి ఎలాగైనా సీఎం అవ్వాలని వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడే కాని..పార్టీలో సీనియర్లను కలుపుకుని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు మాత్రం ప్రయత్నించడం లేదని ఆయన వ్యవహారశైలిని బట్టి అర్థమవుతోందిటీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో రేవంత్ ఒంటెద్దుపోకడలపై జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వీహెచ్, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లు రగిలిపోతున్నరు. అటు కాంగ్రెస్ హైకమాండ్ తనను సపోర్ట్ చేస్తుండడంతో రేవంత్ కూడా సీనియర్లపై కత్తిగట్టినట్లు వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ సీనియర్లంతా కేసీఆర్ కోవర్టలంటూ తన వర్గంతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నాడు. కాగా మరోవైపు మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అపరచాణక్యుడు కేసీఆర్‌ రేవంత్‌తో విబేధాల నేపథ్యంలో కీలక కాంగ్రెస్ సీనియర్లను పార్టీలోకి రప్పించేందుకు వ్యూహం రచిస్తున్నాడని హస్తం వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వంటి కాంగ్రెస్ సీనియర్ల వ్యవహారశైలి ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి పొడగిట్టని నలుగురు కాంగ్రెస్ సీనియర్లను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు దగ్గరకు చేర్చుకుంటున్నారని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇటీవల సంగారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా వ్యవహరించడం, కేటీఆర్ సైతం జగ్గారెడ్డిపై ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్ వర్గాలకు షాక్ ఇచ్చింది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కూడా మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా మెలగుతున్నట్లు టాక్. ఇటీవల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకుమారుడి వివాహంలో కేటీఆర్‌‌తో దుద్దిళ్ల క్లోజ్‌గా మూవ్ అవడంతో ఆయన కూడా కారెక్కబోతున్నారా అని హస్తం పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రహీంపట్నంలో మంత్రి కేటీఆర్‌తో, ఆ తర్వాత జనగామ, యాదాద్రిలో సీఎం కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకుని, నవ్వుతూ మాట్లాడడం, ఏకంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్ వర్గాలకు షాకింగ్‌గా మారింది, ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దళితబంధు విషయంలో పలుమార్లు సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. రెండుసార్లు దళితబంధు సమావేశాల నిమిత్తం ప్రగతిభవన్‌‌కు వెళ్లారు.

అంతే కాదు మంత్రి కేటీఆర్ కూడా కాంగ్రెస్‌లో ఉన్న నిఖార్సైన , నిజాయితీ కలిగిన గట్టి నాయకుడు భట్టి విక్రమార్క అంటూ కొనియాడారు. ఈ నేపథ్యంలో నలుగురు కాంగ్రెస్ సీనియర్లు రేవంత్‌తో విబేధాల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్‌లతో సన్నిహితంగా ఉంటున్నారని, ఇప్పటికిప్పడు కాకపోయినా..ఎన్నికల టైమ్‌కు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరడం ఖాయమని రేవంత్ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఆ నలుగురు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నామే తప్పా..కాంగ్రెస్‌ను వీడేది లేదని, ఇదంతా రేవంత్ రెడ్డి తమను వెళ్లగొట్టేందుకు చేయిస్తున్న ప్రచారమని గుస్సా అవుతున్నరు. అయితే సీఎం కేసీఆర్ మోదీని, బీజేపీని టార్గెట్ చేయడం, రాహుల్‌గాంధీకి సపోర్ట్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని, ఆ నలుగురు కాంగ్రెస్ సీనియర్లు మున్ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, కారెక్కినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ పతనమవడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -