హుజూరాబాద్‌లో రేసు నుండి తప్పుకోనున్న కాంగ్రెస్..?

137
revanth

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకోనుందా..పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో రేవంత్‌రెడ్డి చేతులెత్తేసాడా..టీఆర్ఎస్‌ను ఓడించేందుకు బీజేపీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందా….ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..హుజూరాబాద్‌ పోరులో చేయి గుర్తు పార్టీ చేతులెత్తేసినట్లే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ పోరులో ఉండగా…టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయడం ఖాయమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా హుజూరాబాద్‌లో గెలిచిన చరిత్ర లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌‌లో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకులే కరువయ్యారు. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని ఈటల రాజేందర్‌కు, బీజేపీకి గట్టి షాక్ ఇచ్చి, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదని చాటి చెప్పాలని సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై గత కొద్ది రోజులుగా రేవంత్‌రెడ్డి తర్జనభర్జనలు పడుతున్నాడు.

సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తీసుకురావడంతో దళితుల ఓట్లను చీల్చేందుకు తొలుత దామోదర రాజనర్సింహను దళిత అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నట్లు చర్చ జరిగింది. కానీ ఆయన పోటీలో లేనని ప్రకటించారు. దళిత కోటాలో కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వరంగల్‌కు చెందిన దొమ్మాటి సాంబయ్య పేర్లు కూడా వినిపించాయి. బీసీ కోటాలో పొన్నంప్రభాకర్ కూడా పేరు కూడా బలంగా వినిపించింది. మరోవైపు కొండా సురేఖ కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడేమో అసలు కాంగ్రెస్ పోటీలోనే ఉండదనే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్‌లో ఎలాగూ గెలిచే సీన్ లేదని రేవంత్‌రెడ్డికి అర్థమైంది. ఇక్కడ పోటీని టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కాకుండా ఈటల వర్సెస్ కేసీఆర్‌గా రేవంత్‌రెడ్డి భావిస్తున్నాడంట… తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపి ఓట్లు చీలిస్తే అది అధికార టీఆర్ఎస్‌కు ప్రయోజనం కలిగిస్తుందని రేవంత్ అండ్ కో భావిస్తున్నారంట… ఇక్కడ ఈటల గెలిస్తే ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుంది కానీ బీజేపీకి కాదని రేవంత్‌తో సహా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారంట..అందుకే అధిష్ఠానంతో మాట్లాడి ఎన్నికల నుంచి తప్పుకుంటేనే మేలనే ఆలోచన చేస్తున్నారని గాంధీభవన్‌ నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది.

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్ ఉన్నవేళ ఒకవేళ పోటీ చేస్తే కనీసం డిపాజిట్ దక్కకపోతే పరువు పోవడం ఖాయం కాబట్టి ముందుగానే పోటీ నుంచి తప్పుకుంటే బెటరని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడంట.. మొత్తంగా టీఆర్ఎస్‌ను ఓడించడానికి రేవంత్ రెడ్డి ఈటలతో కుమ్మక్కై, తమ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయకుండా చూస్తాడా అనే విషయమై ఆసక్తి నెలకొంది. మరి హుజూరాబాద్‌‌ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ పోటీలో ఉంటుందో? లేదా చేతులెత్తేస్తుందా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.