మంత్రుల మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పర్యటన కేవలం వ్యయప్రయాసే అయింది! ప్రభుత్వం అనుకున్న ఉద్దేశ్యం నెరవేరక పోగా మీడియా ముఖంగా మంత్రులు అధికారులను నిలదీసినవైనంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్లను ఇరకాటంలో పెట్టబోయి మంత్రులే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, వాళ్ల వ్యవహారశైలి ఇరిగేషన్ అధికారులకు సానుభూతిని తెచ్చిపెట్టేలా చేశాయనే కామెంట్స్ కూడా వినిపించాయి!
రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన సందర్భంగా లక్ష్మి బ్యారేజ్ కు 3 కిలో మీటర్ల దూరంలోని అంబటిపల్లి గ్రామంలో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డ బ్యారేజిని చూపించేందుకు మంత్రులు స్టేట్ మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లారు. అనుకున్న సమయానికే కార్యక్రమం ప్రారంభమైనా, సమయాభావం వల్ల అక్కడికి వచ్చిన ఎల్ అండ్ టీ, ఇతర నిర్మాణసంస్థల ప్రతినిధులకు మాట్లాడే అవకాశం లభించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈఎన్సీ మురళీధర్ రావు ఒక సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పూర్వ కరీంనగర్ జిల్లా మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, గోదావరి నది ఒడ్డున ఉన్న చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డిలు మంత్రుల బృందంలో ఉన్నారు. ఐతే, ఇరిగేషన్ శాఖతో గానీ, లేదా స్థానికంగా జిల్లాతో గానీ ఏ సంబంధం లేని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మంత్రుల మేడిగడ్డ సందర్శనలో భాగస్వాములవడం కొంత విమర్శలకు తావిచ్చింది. మరోవైపు, ఈ కార్యక్రమంలో ముగ్గురు మంత్రులు మాత్రమే పాల్గొంటారని ముందుగా వెల్లడించినా, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఆ తరవాత మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటిలను కూడా బృందంలో చేర్చారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చేయలేకపోతే, చేతకాకపోతే మీరు సెలవులో వెళ్లాల్సింది అంటూ ఈఎన్సీని కోమటిరెడ్డి అన్న వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అయ్యాయి. మీడియా ముఖంగా తనను అవమానిస్తూ మంత్రి చేసిన ఈ కామెంట్స్ కు ఈఎన్సీ మురళీధర్ నొచ్చుకున్నట్లుగా సమాచారం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతికతలను ప్రశ్నిస్తూ, పొంగులేటి ఒక కాంట్రాక్టరు అవతారం ఎత్తారనే గుసగుసలు కూడా వినిపించాయి. ఇది, ఎవరి ప్రయోజనాలు వాళ్లు ఆశించే కాంగ్రెస్ మార్క్ తతంగమే తప్ప మరొకటి కాదనే రుసరుసలు కూడా అక్కడ వినిపించాయి.
అంబటిపల్లికి బదులుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం లక్ష్మిబ్యారేజి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో శిబిరం ఏర్పాటు చేసి ఉంటే కొంత ప్రభావితంగా ఉండి ఉండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అసలిదంతా పక్కన పెడితే, మంత్రుల బృందం మేడిగడ్డ సందర్శన కేవలం ప్రచార పటాటోపమే అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అక్కడ ఇచ్చిన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషనేదో హైదరాబాదులోని జలసౌధాలోనే ఇచ్చి ఉంటే, ప్రభుత్వం చెప్పదలచుకున్న విషయం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లి ఉండేదని కొందరు అధికారులు సణుక్కోవడం సైతం జరిగింది.
ఇక, అంబటిపల్లిలో శిబిరంలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈఎన్సీ మురళీధర్ తో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించారు. ఆ ప్రజెంటేషన్ ఆద్యంతం కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ కరెక్టే అనే కోణంలోనే సాగింది. మంత్రులు కూడా ఈఎన్సీ ఇస్తోన్న ఆ ప్రజెంటేషన్ను అత్యంత ఆసక్తిగా వింటున్న తరుణంలో, మంత్రులను అప్రమత్తం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ కాల్ వచ్చిందని సమాచారం. దీంతో తేరుకున్న మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మధ్యంతరంగా ఆపేసి తమ సంశయాలను ఏకరువు పెడుతూ వాస్తవ ఎజెండాలోకి దిగారు. ఆ తరవాత మేడిగడ్డ సందర్శనను ముగించుకొని మంత్రులు ఛాపర్లో అన్నారం బ్యారేజీకి వెళ్లారు. అక్కడ బ్యారేజిని సందర్శించి హైదరాబాదు చేరుకున్నారు.
Also Read:రైట్ ట్రైలర్‌పై మనోజ్ ప్రశంసలు