సీఏఏపై రాహుల్ ‌గాంధీ సంచలన వ్యాఖ్యలు..!

198
rahul gandhi
- Advertisement -

కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్నార్సీ, సౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2019 చివర నుంచి గతేడాది కరోనా లాక్ డౌన్ ముందు వరకూ సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు దేశాన్ని అట్టుడికించాయి. ఇప్పటికే కేరళ, పశ్చిమమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయమంటూ అసెంబ్లీలలో తీర్మానాలు కూడా చేశాయి. అయితే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై వెనుకడుగు వేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఏఏను పున:ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోంలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికలలో అధికార బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారం నిలబెట్టుకోవడానికి బీజేపీ నానా తంటాలు పడుతోంది. మోదీ, అమిత్‌షాలు స్వయంగా రంగంలోకి దిగి అసోంలో ప్రచారం చేస్తున్నారు. అయితే కేంద్రం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏ చట్టాలను తొలుత అసోంలోనే ప్రయోగించారు. సీఏఏని అసోం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలో అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా డిబ్రూగఢ్‌లో పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిలిపేస్తామని హామీ ఇచ్చారు. లహోవాల్‌లో విద్యార్థులు, యువతతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్‌ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం క్షీణించడానికి, నిరుద్యోగం పెరగడానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించారు.

సీఏఏతోపాటు నూతన సాగు చట్టాలపై నిరసనలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. . ‘‘ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని మీరు అనుకుంటున్నారు. యువత నిరుద్యోగులయ్యారని, రైతులు నిరసనలు తెలుపుతున్నారని, సీఏఏ ఉందని అనుకుంటున్నారు. అసలు భారత దేశం అంటే ఏమిటనేది ప్రశ్న. వేర్వేరు సంస్కృతులు, భాషలు, మతాలు కలిసినదే భారత దేశం. అస్సామీలు ఢిల్లీ వస్తే, వారి సంస్కృతి, చరిత్ర, భాషలను మర్చిపోవాలని కోరలేం. ఏ రోజైతే అలా చెప్పామో, అప్పుడే భారత దేశం ఆలోచన ముగుస్తుందని అన్నారు. నాగపూర్‌లో పుట్టిన ఓ శక్తి యావత్తు దేశాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది ” అంటూ పరోక్షంగా ఆరెస్సెస్‌‌పై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. మొత్తంగా అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే సీఏఏ అమలును నిలిపివేస్తామంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -