ప్రభుత్వం చేపట్టిన భూసర్వేపై విమర్శలు గుప్పించడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు. శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం…కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వ్యాఖ్యలను తప్పుబట్టారు. అభివృద్ధి పేరిట అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని మాట్లాడటం సరికాదని అసలు విషయం వదిలిపెట్టి సంబంధం లేని విషయాలపై మాట్లాడుతున్నారన్నారు. అసైన్డ్ భూములు ప్రభుత్వం ఎక్కడ లాక్కున్నదో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.
భూ రికార్డుల ప్రక్షాళనను హర్షించాల్సింది పోయి.. వ్యతిరేకించడం తగదన్నారు. రైతుల పెట్టుబడి కోసమే రికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో.. ఏ రైతుకు ఎంత భూమి ఉందో సర్వే ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు సీఎం. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ.. ప్రతి విషయాన్ని వ్యతిరేకించడం ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తగదని సీఎం కేసీఆర్ అన్నారు.
స్వయంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్‌రెడ్డి అమ్మిన భూములకు రికార్డు లేదన్నారు. అప్పుడు సాదా బైనామాతో సర్వే నెంబర్ 220లో ఒక ఎకరా 30 గుంటల భూమిని గిరిజన వ్యక్తి ధరావత్ హన్మంత్ నాయక్‌కు అమ్మారని సీఎం గుర్తు చేశారు. మొన్నటి సర్వే సమయంలో.. హన్మంత్ నాయక్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
అప్పుడు రెవెన్యూ అధికారులు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సంప్రదించి విషయాన్ని తెలియజేశారని చెప్పారు. ఆ భూమిని హన్మంత్ పేర పట్టా చేసేందుకు ఉత్తమ్ కూడా అంగీకరించడంతో నాటి పని మొన్న పూర్తి అయిందన్నారు సీఎం. మరి.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రికార్డుల ప్రక్షాళన జరిగితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయని సీఎం ప్రశ్నించారు.