అధిష్టానం అదిలించడంతోనే రేవంత్ ఒంటెద్దు పోకడకు చెక్ పడిందా? సొంత పార్టీలో చిచ్చు రగలడంతోనే లోగో విషయంలో అమాంతంగా వెనిక్కి తగ్గాల్సి వచ్చిందా? రాజముద్ర మార్పు వ్యవహారంలో అయిష్టంగానే సీఎం అందరి ఆమోదంతో అనాల్సి వచ్చిందా? అన్న ప్రశ్నలన్నిటికీ అటు కాంగ్రెస్, ఇటు ప్రభుత్వ శ్రేణులు ఔననే సమాధానం చెప్తున్నాయి! డామిట్, కథ అడ్డం తిరిగింది అనుకుంటూ అధికారిక చిహ్నం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నఫళంగా యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చిందనేది ఆ రెండు వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ!
అధికార చిహ్నం మార్పు సెగ ఢిల్లీ పెద్దల దాకా తాకింది! రాజముద్ర రచ్చ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తోన్న ఆందోళన తదితర విషయాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, మంత్రులు హైకమాండ్ కు చేర వేసినట్లు సమాచారం! చివరకు, అధిష్టానం మందలింపుతోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నం మార్పుపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వినికిడి. లోగోలో మార్పులు, చేర్పులు చెయ్యాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపించినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకించినట్లు సమాచారం. అధికారిక చిహ్నాంలో కాకతీయ తోరణం, చార్మినార్లు ఉంటే తప్పేంటనే అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది మన సాంస్కృతిక నేపథ్యాన్ని, వారసత్వ సంపదను ప్రజలకు దూరం చేసినట్లే అని కూడా వాళ్లు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 1300 ల ఏళ్ల చరిత్ర గల కాకతీయ కళాతోరణం, ప్లేగు వ్యాధిని ఎదుర్కోవడానికి స్ఫూర్తిగా 400 ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్ రెండూ రాజరికపు ఆనవాళ్లు కావని సొంత పార్టీ నాయకులే అన్నట్లు వినికిడి. అందుకే, అధికారిక చిహ్నం మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ అయిష్టంగానే మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చిస్తాం, అందరి ఆమోదం తీసుకుంటాం అన్న మాట మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతోంది.
మరోవైపు, రాష్ట్రాల రాజముద్రల కోసం భారత ప్రభుత్వం గతంలో ఒక చట్టాన్ని కూడా చేసింది. ఏ రాష్ట్రమైనా ఆ చట్టానికి లోబడే, దాని అధికారిక చిహ్నాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ పాలకులు పూర్తి చట్టబద్ధంగా, తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వం ఉట్టిపడేలా అధికారిక చిహ్నాన్ని రూపొందించి ఆమోదించారు. ఆ తర్వాత ఆ రాజముద్ర ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి సైతం పంపించి సమ్మతి తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆమోదం తెలిపిన చిహ్నం అధికారికంగా వినియోగంలోకి వచ్చిన తరవాత మార్చడం కుదరదనే వాదనలు వినిపిస్తున్నాయి. అవసరం ఐతే, న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించి పోరాటం చేస్తామనేది తెలంగాణా వాదుల వెర్షన్!
ఇక, అధికార పీఠం ఎక్కిన నాటి నుంచీ సీఎం రేవంత్ రెడ్డిది ఒకటే పాట! ఏదో తప్పు జరిగినట్లు చిత్రీకరించడం, గత పాలకుల నిర్ణయాలను సవరిస్తాం అనడం! ప్రజలకు పాలన అందించే క్రమంలో ఏదో ఉక్రోషం! తొందరపాటు! తెలియని ప్రతీకారం! రగిలే అంతర్మధనం! వెరసి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనేంత స్థాయిలో కసి! తాను అనుకున్నది జరిగి తీరాలనే పంతం, అంతే! అధికారం శాశ్వతం కాదనీ, ప్రభుత్వం అంటే గత పాలనకు కొనసాగింపనీ, పాలనలో ప్రతి అడుగూ చట్టానికి కట్టుబడి వేసేదే అన్న విచక్షణ మాత్రం మృగ్యం! ఫలితం ఏకపక్ష ప్రకటనలు, ఆధిపత్య నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు! అందుకు ఉదాహరణే అధికారిక చిహ్నంలో మార్పులు! కానీ, ఎంత రంకెలేసే ఎద్దైనా మెడ వంచాల్సిందే, తల దించాల్సిందే! హైకమాండా మజాకా, దటీజ్ కాంగ్రెస్!
Also Read:Revanth:ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు