కాంగ్రెస్,బీజేపీ… దొందూ దొందే

78
- Advertisement -

కాంగ్రెస్,బిజెపి… దొందూ దొందే
ప్రచారాస్త్రంగా పరస్పర అవినీతి
చేసిన అభివృద్ధినే చెప్పుకొంటున్న టిఆర్ఎస్
వారి నిందారోపణలే టిఆర్ఎస్ కు బలం
ఆ రెండు పార్టీలపై జనం పెదవి విరుపు

మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బి.జే.పి)ల బండారాన్ని బయటపెట్టాయి. అవినీతి ఆరోపణలనే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని ఆ పార్టీలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్నాయి. ఈ రెండు పార్టీల తిట్ల దండకాలపై మునుగోడు జనం ఇరు పార్టీల నేతలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు అధికార టి.ఆర్.ఎస్. (బి.ఆర్.ఎస్) పార్టీ మాత్రం గడచిన ఏడేళ్ళల్లో మునుగోడు నియోజకవర్గానికే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చిన సంగతులను ప్రజలకు గుర్తుచేస్తూ ఓట్లు అడుగుతోంది. మునుగోడు జనాన్ని దశాబ్దాలుగా పట్టిపీడించిన ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించిన పార్టీగా, ఇంటింటికీ నల్లా నీటిని ఉచితంగా సరఫరా చేసిన పార్టీగా టి.ఆర్.ఎస్.నేతలు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతుండగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బి.జె.పి.లు మాత్రం నేతల అవినీతిని, కాంట్రాక్టులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతుండటంతో ప్రజల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తేటట్లు చేశాయి.

బి.జె.పి.అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే ఆ పార్టీలో చేరాడని టి.పి.సి.సి.అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ప్రధాన ఆరోపణతో ప్రచారం చేస్తున్నారు. అసలు మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చిందే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడటం మూలంగానే అని, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టులు ఇస్తే పెద్దవాడు అయ్యాడని కూడా టి.పి.సి.సి.నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రెండు కీలకమైన ఆరోపణలపై మునుగోడు ప్రజల్లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారంటే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్రమాలకు పాల్పడిందని అంగీకరిస్తున్నట్లే కదా… అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లే కదా… కాంట్రాక్టులను ధర్మబద్ధంగా కాకుండా లాబీయింగ్ ద్వారా కూడా ఇవ్వవచ్చునని ఈ ఆరోపణలు నిజంచేస్తున్నాయి కదా… అనే చర్చ జరుగుతోంది. అందుచేతనే కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణల్లోనే వై.ఎస్.హయాంలో జరిగిన అక్రమాలను కూడా రేవంత్ రెడ్డి వంటి నేతలందరూ ప్రచారం చేసుకొంటున్నారనే చర్చ జరుగుతోంది. దీనికితోడు ఇక బి.జే.పి.నేతలు కూడా కాంగ్రెస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో తాము కూడా అవినీతి, అక్రమాలను ఎరగా వేశామని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లే ఉందని మునుగోడు నియోజకవర్గంలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకొంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గడచిన 20ఏళ్ళుగా కాంట్రాక్టులు ఉన్నాయని, ఆయనకు అక్రమంగా బొగ్గు కాంట్రాక్టులు ఇవ్వలేదని, సక్రమంగానే ఆయనకు కాంట్రాక్టులు దక్కాయని చెప్పకనే చెబుతూ బి.జే.పి.చేసిన ఘనకార్యాలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో… కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజీనామా చేసేటంతటి కష్టం ఏమొచ్చిందో…. రాజీనామా చేయమని ఎవ్వరు కోరారు..?, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ఒక్క బలమైన కారణం ఏముంది… కేవలం రేవంత్ రెడ్డి పి.సి.సి.అద్యక్షుడయ్యాడనే కుంటిసాకును బూతద్దంలో చూపించి 18 వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గు కాంట్రాక్టును దక్కించుకోవడానికి ఆడిన డ్రామాగా మునుగోడు జనంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బి.జే.పి.అధిష్టానం కూడా తమ పార్టీలో చేరితేనే ఆ కాంట్రాక్టు దక్కేటట్లు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భేటీ అయ్యారని టి.పి.సి.సి.నేతలు చేసిన ఆరోపణలు, మీడియాలో వచ్చిన కథనాలనీ మునుగోడులో బి.జే.పి.అభ్యర్ధిని జనం నిలదీసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల బి.జే.పి.నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గత 20 ఏళ్ళుగా కాంట్రాక్టు వ్యాపారాలు చేస్తుంటాడని, ఇప్పడు ఆయన కుమారుడు కాంట్రాక్టులు చేస్తున్నాడని, అందులో తప్పేముందని ఎన్నికల ప్రచార సభల్లో ఈటల ఈ ఆరోపణలకు రాజముద్రవేయడం కూడా ప్రజల్లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఇలా కాంగ్రెస్, బి.జే.పి.ల నేతలు చేసుకొంటున్న పరస్పర ఆరోపణలన్నీ “దొందూ దొందే”అని జనం చీత్కారంతో నిందించే పరిస్థితులకు ఆ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మునుగోడు జనం మండిపడుతున్నారు.

బి.జే.పి, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకరి లొసుగులను మరొకరు వేలెత్తి చూపుకొంటూ అధికారంలో ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించుకోవచ్చుననే విషయాలను ప్రజలకు తెలిసేటట్లు చేయగలిగారని విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో అధికార టి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, మంత్రులు మాత్రం మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా నీరు, మిషన్ కాకతీయ పథకంలో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులకు పుష్కలంగా నీరు నిల్వ ఉండేటట్లుగా చేసిన తీరును, ఫోరైడ్ సమస్యను శాశ్వతంగా పారద్రోలిన పార్టీగా చెప్పకొంటూ ప్రచారం చేస్తుండటంతోనే ఎన్నో గ్రామాల్లోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు సర్పండ్లు, ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి.లు, ఇతర హోదాల్లోని నాయకులు మూకుమ్మడిగా టి.ఆర్.ఎస్.పార్టీలో చేరారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అంతేగాక కాంగ్రెస్, బి.జె.పి.ల నేతల ప్రచారంలో ప్రధానాస్తంగా ఉన్న అవినీతి, అక్రమాలే ఆ పార్టీలను వదిలి టి.ఆర్.ఎస్.లో చేరేందుకు దోహదపడ్డాయని అంటున్నారు. బి.జే.పి, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం నిందారోపణలు చేసుకొంటుంటే జనం మాత్రం ఈ రెండు పార్టీలకు ఓట్లేస్తే మనకు ఒరిగేదేముంటుంది?, గెలిచిన తర్వాత స్వలాభం కోసం పార్టీలు మారుతూనే ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీలు అవినీతి, అక్రమాలు విషయంలో ఎవ్వరికి ఎవ్వరూ తీసిపోరని, దొందూ దొందే..నని వ్యాఖ్యానాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొంటే టి.ఆర్.ఎస్.పార్టీ నేతలు వ్యూహాత్మకంగా చేసిన అభివృద్ధి, సంక్షేమ గురించి, మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.

- Advertisement -