Congress:ఆరు గ్యారెంటీల అమలు.. పక్కా?

14
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలుచేసి తీరుతామని సి‌ఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాజాగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 లకు వంట గ్యాస్ పథకాలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ” ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, ఈ ఆరు గ్యారెంటీలను చూసే ప్రజలు కాంగ్రెస్ కు అధికారమిచ్చారని ” చెప్పుకొచ్చారు. ఈ రెండు పథకాలను చేవెళ్ళలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అమలు చేయాలని భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సచివాలయంలోనే ప్రారంభించినట్లు సి‌ఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. .

మహాలక్ష్మి, గృహజ్యోతి.. ఈ రెండు పథకాలకు అర్హులైన వారందరు అప్లై చేసుకోవచ్చని సి‌ఎం రేవంత్ అన్నారు. రూ.500 లకే వంటగ్యాస్ పథకానికి తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ది దారుడు పూర్తి నగదు చెల్లించి వంటగ్యాస్ తీసుకోగా.. సబ్సిడీ రూపంలో రూ.500 పోగా మిగిలిన నగదును నేరుగా లబ్ది దారుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం.

అలాగే రూ.200 యూనిట్ల ఉచిత కరెంటును పథకానికి అర్హత ఉండి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోయి ఉంటే మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారి వద్దకు వెళ్ళి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆరు గ్యారెంటీలలో భాగంగా దాదాపు పదమూడు హామీలు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు పథకాలతోపాటు తాజాగా అమలు చేసిన రూ.500 వంటగ్యాసు, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటివి కేవలం నాలుగు పథకాలు మాత్రమేనని.. ఇవి నాలుగు గ్యారెంటీలు కాదనే విమర్శ వినిపిస్తోంది. మరి ఈ విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.

Also Read:TTD:విజ‌య‌వంతంగా 12వ గుండె మార్పిడి

- Advertisement -