మరో రెండు గ్యారెంటీలు.. మాత్రమే!

23
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు.. వంటి హామీలను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. మిగిలిన గ్యారెంటీ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది. అయితే లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ హామీల అమలు జరుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో తీపి కబురు వినిపిస్తూ మరో రెండు గ్యారంటీ హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు.. ఈ మూడింట్లో రెండిటిని వెంటనే అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సి‌ఎం రేవంత్ రెడ్డి సమీక్షా నిర్వహించారు.

ఈ సమావేశంలో రెండు హామీల అమలును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ నెల 6న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించి ఆ తర్వాత రెండు గ్యారెంటీ హామీలను అమల్లోకి తీసుకురానున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో ఐదు గ్యారెంటీ హామీల అమలుకై దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదు అయినట్లు తెలుస్తోంది. అర్హత ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉండడంతో హామీల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు విధిస్తుందా అనే సందేహాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. మరి ప్రస్తుతానికి మరో రెండు హామీలను మాత్రమే అమల్లోకి తీసుకోచ్చేందుకు రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మిగిలిన హామీలను వంద రోజుల్లో నిజంగానే అమల్లోకి తీసుకొస్తుందా అనేది చూడాలి.

Also Read:తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ దెబ్బే?

- Advertisement -