అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగుతున్నాయి. ఇటివలే పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు గిరిజిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు. అదే బాటలో నడిచేందుకు మరో ఎమ్మెల్యే సిద్దమయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా త్వరలో టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ది కోసమే తాను పార్టీ మారుతున్నట్లు తెలిపారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
నల్లగొండ జిల్లా ప్రగతి కోసం, నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ది కోసం తాను కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని, టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు లింగయ్య అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుల వైఖరిలో మార్పు రాలేదు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ వల్ల నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తవుతోందన్నారు.