కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానాలే ఎదురవుతున్నాయన్నారు ఓయూ విద్యార్ధి నేత క్రిశాంక్. ఈసందర్భంగా ఆయన టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకీ అలాగే కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. అంతేకాకుండా ఉత్తమ్ తీరుకు నిరసనగా తాను తయారు చేసుకున్న రూ.15లక్షల ప్రచార సామాగ్రిని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. తాను పార్టీని వీడుతున్నట్టు తెలిసినా ఉత్తమ్ కనీసం స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు క్రిశాంక్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు.
పార్టీ మీటింగ్ ల కోసం ఉచితంగా గార్డెన్ హాల్స్ మాట్లాడాలని అర్ధరాత్రి కూడా ఫోన్లు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..నేను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా కూడా కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసారని..టికెట్ ఇస్తారన్న నమ్మకంతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు తప్పకుండా టికెట్ ఇస్తానని హామి ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వకుండా మరోసారి మోసం చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించలేకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇస్తారన్న ఉద్దేశంతో క్రిశాంక్ కొంతకాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. అయితే కంటోన్మెంట్ టికెట్ అతని మామ సర్వే సత్యనారాయణకు కేటాయించారు. దీంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానన్న క్రిశాంక్ ను పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇస్తామంటూ బుజ్జగించారు. ఇప్పుడు కూడా ఆయనకు మెండిచేయి చూపియడంతో ఆయన అధిష్టానం పై సీరియస్ అయ్యారు. ఇక క్రిశాంక్ నేడు తన మద్దతుదారులతో కలిసి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలుస్తుంది.