కామ్రేడ్ కళ్యాణ్..బ్లాక్‌బస్టర్

5
- Advertisement -

హీరో శ్రీ విష్ణు నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటున్న నేపథ్యంలో చిత్రబృందం ‘దసరా ఫన్ డగ్ బ్లాక్‌బస్టర్ మీట్’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, ఆర్. నారాయణమూర్తి, వి.ఎన్. ఆదిత్య తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సినిమాను ఇంత పెద్ద విజయంగా నిలిపిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత వెంకట కృష్ణ తనకు మంచి స్నేహితుడిగా మారారని, సినిమా విజయానికి ఆయన ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. దర్శకుడు జానకిరామ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. సత్య అద్భుతంగా నటించారని, ఆయన పాత్రకు వస్తున్న స్పందన ఆనందాన్నిస్తోందని చెప్పారు. చిత్రంలోని సాంకేతిక నిపుణులు, నటీనటులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. వినోదాన్ని, విప్లవ భావాలను సమతుల్యం చేస్తూ సినిమా రూపొందించడం అభినందనీయమన్నారు. శ్రీ విష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని ప్రశంసించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

రచయిత, సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల ఆదరణతోనే సినిమా విజయవంతమైందన్నారు. శ్రీ విష్ణు సినిమా బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారని కొనియాడారు. చిత్రంలోని ‘ఒరియా పిల్ల’ పాట ఒడిశాలోనూ వైరల్ అయిందని వెల్లడించారు.

Also Read:‘రుటూర్’ను ప్రారంభించిన కేటీఆర్

ప్రముఖ దర్శకుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, ఇందులో కామెడీతో పాటు ప్రేమకథ, యాక్షన్ కూడా ఆకట్టుకుంటాయని తెలిపారు. శ్రీ విష్ణు నిర్మాతలకు ఉపయోగపడే ప్రతిభావంతమైన నటుడని ప్రశంసించారు.

నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడుతూ.. ప్రేక్షకుల స్పందన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. దర్శకుడు జానకిరామ్ తన తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందాన్ని సత్కరించి షీల్డ్స్ అందజేశారు.

- Advertisement -